"మహాకవి" శ్రీ మధునాపంతుల వర్ధంతి సందర్భముగా
గురువృత్తిం గొని, తెల్వి జోతి నిడి, మీకుం పేరు తేజాలు ప
ల్వురు శిష్యోత్తములన్ గడించితిరి; యీ లోకంబె ధన్యంబగున్
చిరతేజా ! మిము గాంచి; మీరు ఋషులో ! సిద్ధార్థులో ! "నానృషిః
కురుతే కావ్య" మటన్న పండితుల సూక్తుల్ గూర్పవే నిశ్చితుల్.
అర్వాచీన మశాశ్వతంబు రసశూన్యంబౌ కవిత్వం బిలన్
దుర్వారంబుగ తాండవించు తఱి చేతోమోదమౌ కావ్యమున్
సర్వామోదముగారచించితిరి శశ్వత్కీర్తి ! నిద్రాణమున్
నిర్వీర్యంబగు జాతి చేతనముగా నిత్యమ్ము భాసిల్లగన్.
ధన్యుడ, "వాంధ్రి" పత్రికను స్థాపన జేసిన దేశభక్తమూ
ర్ధన్యుడ, "వాంధ్ర పద్య కవితా" వరివస్యకు స్ఫూర్తి, వాత్మచై
తన్యుడ, "వాంధ్ర కల్హణ !" సుధామధురాంధ్ర పురాణకర్త !" స
మ్మాన్యుడ, వాశిషం బొసగుమా ! "కలభాషిణి" కిన్ "మహాకవీ !"
ఆంధ్రుల భుజశక్తి, యతులిత ఘనకీర్తి
వీనుల విందుగా వినిచె నెవడు ?
ఆంధ్ర కళాలక్ష్మి యందాలు చిందగా
స్థిరరూప మిచ్చిన శిల్పి యెవడు ?
మచ్చున కేనియు పెచ్చుమాటాడని
పరహిత మృదు మితభాషి యెవడు ?
ఆడంబరము లేని యతి సాధుమూర్తియై
యొరుల జోలికి పోని యోగి యెవడు ?
అట్టి యకలంక మధుమూర్తి ! యనఘకీర్తి !
రాణ్మహేంద్ర పురీంద్ర గౌరవ పతాక !
సరస సత్యనారాయణశాస్త్రి సుకవి !
దివము నందుండి యాశీర్వదింపు మెపుడు.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
No comments:
Post a Comment