audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Saturday 28 May 2011

అరివీర భయంకరులు



                                     అరివీర భయంకరులు

మేరలు మీఱు శత్రుల నమేయ పరాక్రమ వహ్నికీలలన్
నీఱుగ జేసి మాతృధరణీ ఋణ మీగెడు దేశభక్తులౌ
వీరజవానులార! అరివీర భయంకరులార! జేతలై
భారతమాత కీర్తి నిల వ్యాప్తిని జేసిరి శౌర్యధుర్యులై.

పులిగమి, పోతరించు నెనుబోతుల పైబడి చంపు రీతి, నా
కలిగొను సింహసంహతి మృగంబుల పైబడి చంపునట్లుగా
చలిమల కోనలందొదుగు శత్రుల నాక్రమణార్థగాములన్
విలవిలలాడగా తఱిమి పీచమడంచిరి శూరసైనికుల్.

క్రూరుల ముష్కరాధముల ద్రోహుల పాక్ చొరబాటు దారులన్
పోరున పారద్రోలిరి యపూర్వ పరాక్రమ సారబాహులై
భారతదేశగౌరవము భాసిలగా మన వీరసైనికుల్;
హారతులిచ్చి నిండుమది స్వాగత గీతిక లాలపింపుడీ !
డా .యస్వీ  రాఘవేంద్ర రావు 
[కార్గిల్ వీరుదు "రవిప్రసాద్" విగ్రహావిష్కరణ సందర్భముగా
శ్రీవావిలాల సభలో పఠించినవి.]


పుష్కర గోదావరి


                           కవితా నీరాజనము
                          ( పుష్కర గోదావరి)

పుష్కరశోభతో వెలయు పుణ్యనదీ ! భవతాపహారిణీ !
దుష్కృతముల్ మహాఘములు దూరము సేతువు మూడు మున్కలన్,
నిష్కృతి గల్గ జేయుదువు నిష్థుర పాపులకున్ కృపారసా
విష్కరణంబునన్ ధరను వెల్లువ గొల్పెదు జీవధాత్రిగాన్.

నాసిక్ త్రయంబకాన ప్రభవించిన తల్లి !
      బాసర భారతి పాఠమంది,
భద్రాద్రి రాముని పాదాలు సేవించి
       పట్టిసంబున వీరభద్రు గొలిచి,
అభిషేకమొనరించి యా కోటిలింగాల
        రాజమహేంద్రికి ప్రాణమిచ్చి,
కని ఉమాసహిత మార్కండేయ శివుని
         గౌతమముని కూర్మి కన్యవైతి,
సప్త గోదావరంబవై గుప్త గతిని
దర్శనంబంది భీమేశు దక్షవాటి,
కోటిఫలి యందు సోమేశు కోరి కొలిచి,
విభుని గూడితి బ్రహ్మ సంవేద్య మందు.

ఇంతకు ముందు చూడిమొదవేమొ యనన్ మెలమెల్ల సాగితే
అంతటలోనె శక్తిగని యమ్మ పయస్సులనాని చెంగునన్
గంతులువేయు లేగవలె గౌతమి ! వేగముతోడ నేగవే?
అంతరమెన్న సూర్య వరుణాదుల తేజము పొందుటంజుమీ !

అదిగొ ! భద్రాద్రి, గౌతమి యిదిగొ! యనుచు
భక్తి పారవశ్యంబున పాడి పాడి
రామ, భద్రాద్రి, గౌతమీ రాగ బంధ
మిలను "రామదాసు" మిగుల వెలయజేసె.

యుగయుగాల చరిత యుల్లమందున నిల్పి
తరతరాల ప్రజల తన్పు తల్లి !
విశ్వ జనులకెల్ల విజ్ఞాన ఖనివమ్మ !
అమ్మ గౌతమి !కొను మంజ లిదిగొ!

ధరణి కొసగుచు తరగని సిరుల పంట
స్వాదు జలముల ప్రాణుల సేదదేర్చు
జీవనాధార ! గౌతమీ ! పావనాంబ !
అమ్మ ! గోదావరీ మాత ! ఆరతిదిగొ !


డా .యస్వీ  రాఘవేంద్ర రావు 
{ది. ౩.౮.౨౦౦౩ తేదీని గోదావరి పుష్కర సందర్భముగా భద్రాచలంలో
పర్యాటక శాఖవారు నిర్వహించిన కవిసమ్మేళనంలో పఠించినవి.}
గోదావరి మాత 

"వేంగీమహాజాని" రాజరాజనరేంద్రుడు


                "వేంగీమహాజాని" రాజరాజనరేంద్రుడు

విమలాదిత్య తనూజ !రాజిత మహావేంగీ మహాజాని !పం
చమవేదప్రథితాంధ్రభారత మహా సత్కావ్యకర్త్రాశ్రయా !
హిమవజ్జావర నిత్యపూజన తపస్వీ ! రాజరాజాహ్వయా !
అమృతాకార !చళుక్యరాజ !కొనుమయ్యా ! సన్నుతుల్, హారతుల్.

పంచమవేదమై పరగు భారతమున్ నన్నపార్యుడన్
ప్రాంచిత సత్కవీశకృషికాగ్రణి నీ యభిలాష మెరకున్
గాంచడె తెల్గునేలతొలికావ్యపు పంటను, రాజరాజ ! కా
మించుయశోలతాంగి నిను, మించెడు దక్షపురీశ్వరాదృతిన్.

ఘనమణిదీప్తి కంకణము, కంకణదీప్తిని రత్న మెవ్విధిన్
మనునొ విశేషశోభగని; మానితకీర్తిని నన్నపార్యుడున్
గనె నటు నీదు ప్రాపుగని; కాంచితి వీవు చిరప్రశస్తి నా
తని కృతి భారతంబుగొని, దక్కె యశోనిధి రాణ్మహేంద్రికిన్
దనరెడు గంధభూరుహపుతావులు భూమికి నబ్బునట్లుగన్.

రాజమహేంద్రి ధన్య, కవిరాజ ! మిముంగని; ధన్యుదయ్యె నా
రాజనరేంద్రు డాశశివిరాజిత కీర్తిసమార్జనంబునన్
తేజమునొంది రాంధ్రులు త్వదీయ కృతిన్; గయికొమ్ము భక్తి నీ
రాజనముల్ బుధావళినిరంతర మర్చనసేయు నిమ్ములన్
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
[శ్రీవేంకటేశ్వర ఆనం కలాకేంద్రంలోరాష్ట్ర సాంస్కృతిక శాఖచే౧౯౯౬ సం.
అక్టోబరు ౪,౫,౬ తేదీలలోనిర్వహింపబడిన "చాళుక్య ఉత్సవాల" లో
భాగంగా ది,౫,౧౦,౧౯౯౬ తేదీని "తెలుగు విశ్వవిద్యలయం"సాహిత్య
పీఠాధిపతి ఆచార్య సి..రమణయ్యగారి ఆధ్వర్యవంలో నిర్వహింపబడిన
"కవిసమ్మేళనం" లో గానం చేసినవి.]

ఆదికవికి అక్షరాంజలి


        ఆదికవికి అక్షరాంజలి
ఆంధ్రవాణీబాల కక్షరాల్ నేర్పిన
       దివ్యుడౌ నాచార్యదేవుడెవడు?
తెలుగు కవిత్వంపుతీవను నాటిన
        యలనాటి కవికృషీవలు డెవండు?
"తన కులబ్రాహ్మణుం"డని మెచ్చు ఱేనికి
         వేదసూక్తమ్ములు వినిచె నెవడు?
పంచమశ్రుతియైన భారతకృతిగీతి
          పాడి విన్పించిన ప్రోడ యెవ్వ
డట్టి "వాగనుశాసను", నవిరళ జప
హోమతత్పరు", "సద్గుణధాము" "ననఘు",
"సకల వేదవిదుని", "నిత్య సత్యవచను",
నన్నపార్యుని ఋషికల్పు సన్నుతింతు.

"భారత రణమున నరునకు
నారాయణునట్లు నాకు నారాయణభ
ట్టారకుదు తోడ్పడె మహా
భారతరచనంబున" నని పల్కితి వనఘా !

ఆతడెట్టి సాయ మందించెనో గాని
నీ కృతజ్ఞతలను నెఱపుకొన్న
తీరుజూడ మీదు తియ్యంపు నెయ్యంబు
తేటతెల్లమయ్యె మేటి సుకవి !

గౌతమీ వాహినీ గతి గలదయ్య నీ        
        కమనీయ కళ్యాణ కావ్య కన్య,       
సుప్రసన్నార్థ సుశోభితయయ్య నీ            
         కమనీయ కళ్యాణ కావ్య కన్య,          
అక్షర రమ్యత నలరించునయ్య నీ
          కమనీయ కళ్యాణ కావ్య కన్య,
రుచిరార్థ సూక్తులన్ పచరించునయ్య నీ
           కమనీయ కళ్యాణ కావ్య కన్య,
సరళ సంస్కృత పద , సర్వశాస్త్ర విషయ
తెల్గువారి యాడపడుచు, దివ్య కీర్తి !
ఇన్ని గుణముల అన్నుల మిన్న! నీదు
కీర్తి కాయంబు నిల్పిన మూర్తి కాదె?

రాజమహేంద్రి ధన్య, కవిరాజ మిముంగని; ధన్యుడయ్యె నా
రాజనరేంద్రు డాశశివిరాజిత కీర్తి సమార్జనంబునన్
తేజమునొంది రాంధ్రులు త్వదీయకృతిన్; గయికొమ్ము భక్తి నీ
రాజనముల్ బుధావళి నిరంతర మర్చన సేయు నిమ్ములన్.

 శబ్దములు వత్తులుగజేసి, సరస రుచిర
 భావగరిమ స్నేహార్ద్రత పదను జేసి,
 పద్య దీపావళిని నేత్రపర్వముగను
 భారతాకాశవీధిలో పాదుకొల్పి
 తొలి తెలుగు వెల్గునింపిన యలఘుమూర్తి !
 అందుకోవయ్య మా యక్షరాంజలులను
[శ్రీ దుందుభి నామ సంవత్సర దీపావళి పర్వ దినమున౧౫వ జాతీయ గ్రంథాలయ వారోత్సవముల సందర్భమున శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయమువారు నిర్వహించినకవిసమ్మేళనమును పురస్కరించుకొని రచించ్నవి]

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి


                రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

జీవనాధార పుణ్యగోదావరీ
దీ మతల్లిక యొడిలోన తృప్తి తీర
అమృత తుల్య సుస్వాదు పయస్సు లాని
రాణకెక్కితివి మహాంధ్రి రాణ్మహేంద్రి !

ఆంధ్ర వాణీబాల కక్షరాల్ నేర్పిన
       "యాచార్య నన్నయ్య " కమ్మ వీవు,
ఆంధ్ర ప్రభుత్వంపు టాస్థాన కవియైన
      ఖ్యాతుదౌ "శ్రీపాద" మాత వీవు,
లలిత హాస్య రసమ్ము నొలికించు "చిలకమ
      ర్తి"ని గన్న యుత్తమ జనని వీవు,
ఖండాంతర ఖ్యాతిగను కళాకారుదౌ
       "దామెర్ల" కున్ కన్న తల్లి వీవు,
ఆదికావ్య సృష్టి కాధారభూతుదౌ
"రాజరాజ" విభుని రాణి వీవు,
సకల కళలనిధివి, సద్గుణాల పృథివి !
రమ్యగుణ మహాంధ్రి ! రాణ్మహేంద్రి !

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,

ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్య కర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు,పూజ్యకవి, యా యుగ పూరుషు కంటి వమ్మరో !

ఉరముం జూపి తుపకి గుండులకు, రౌద్రోదేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వర ధైర్యంబను మంత్రముం గొనిన శశ్వత్కీర్తియౌ "నాంధ్రకే
సరి"కిన్ మాతవు రాణ్మహేంద్రి ! కొనుమా సమ్మన భవ్యాంజలిన్.

"భమిడిపాటి" , "మద్దూరి", "న్యాపతి", "రఘుపతి",
"బ్రహ్మజ్యోస్యుల", యల "దేరాజు", "నేదు
నూరి" ముఖ్యులు నీదు కుమారులమ్మ !
మఱల గత వైభవమ్ముల వఱలుమమ్మ !

ప్రాజ్యవైభవ నిధులు, వాణిజ్యపరులు,
దానకర్ణులు, కవితా కళానిరతులు,
నీదుగారాబు కొమరులై నెగడుచుండ
చిరతర యశమ్ము గనుము,జేజేలు గొనుము. 
(రాజమహేంద్రి "ఛాంబర్ ఆఫ్ కామర్స్" వారు నిర్వహించిన
కవి సమ్మేళనము నందు గానము చేసినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .



 
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు 
శ్రీ చిలకమర్తి లక్ష్మి నరసింహం పంతులు 
శ్రీ రఘుపతి వెంకట రత్నం నాయుడు 
శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు 
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 
దామెర్ల రామారావు 

మహిషాసుర మర్దని


              మహిషాసుర మర్దని
హరి హర బ్రహ్మ రవి చంద్ర వరుణ శక్ర
వసు కుబేర భూమి ప్రజాపతి యమాగ్ని
వాయు సంధ్యల తేజాల ప్రభవ మంది
"శక్తి" వైతివి మహిషుని సంహరింప.

రాక్షసులు మహాహన కాల చక్షురులును,
అల బిడాలాసిరోమ బాష్కలురు, నుగ్ర
దర్శనులను సైన్యపతి సప్తకము నీవు
చండకోపాన వధియించి "చండి" వైతి.

పార్వతీ కాయమున నుండి ప్రభవ మంది
యజ్ఞభాగం బపహరించు నసురులైన
యల శుంభ నిశుంభుల యసువులంది
"కౌశికి" యనెడు నామంబు గాంచి తీవు.

శీత నగమందు విహరించు మాత ! నీవు
క్రూరులౌ చండ ముండుల క్రోధదృష్టి
గాంచినంతనే నీ మోము కాలమయ్యె
"కాళిక" యను నామంబు ప్రఖ్యాతమయ్యె.

"హవ్యభాగంబు దేవత లందుకొనగ
నసురులార ! ముజ్జగ మిచ్చి యమరపతికి,
పఱచి పాతాళలోకంబు, బ్రదుకు" డనుచు
దూతగ శివు బనిచి "శివదూతి"వైతి.

తామస కామ సంతమస దర్పిత మూర్తులు మత్తచిత్తులై
ఆ మహిషాసురాది హతకావళి జంపితి దుర్గ ! శక్తివై;
ఈ మహి నంతకంటెను నికృష్టుల స్వైర విహారవర్తులన్
ఏమరి యుంట నీకు దగునే ? దహియింపుము కంటి మంటతోన్.

జగతి తల్లు లిద్దఱు సర్వజనుల కరయ
నెమ్మి జన్మ నొసగి సాకు "నమ్మ" యొకతె
యాపద గడవగ శుభము నభయ మొసగి
యల యదృశ్యగతిని గాంచు "నంబ" యొకతె.

"వింధ్యవాసిని"యు, "శతాక్షి", "భీమ", "దుర్గ",
"రక్తదంతి", "శాకంభరి", "భ్రామరి" యను
పేర్ల నవతరింతు వటంచు వింటి మేము
అట్టివేళ నే డాసన్నమయ్యె నమ్మ !

"దుష్ట శిక్షణంబు" ధరణి "శిష్ట రక్ష
ణంబు నవతార లక్ష్య మనంగ వినమె ?
అంబ ! పరమేశ్వరీ ! యిల నవతరించి
మహి నసురుల మర్దించు మమ్మ దుర్గ !
 డా .యస్వీ  రాఘవేంద్ర రావు .


వాణీ స్తుతి


Get this widget | Track details | eSnips Social DNA

వెన్నెల వన్నె మైమెరుపు, వెల్లని వల్వలు, వీణెఁ దాల్చియున్,
వెన్నెల చల్వచూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్,
వెన్నెల బోలు కీర్తి నిల విద్దెలు నెర్చినవారికిచ్చ
వెన్నెలవేళ నంచపయి వేడుక వచ్చెడు వాణిఁ గొల్చెదన్.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
 





                                                                                                                              
             
       

                                                      

                                                           

Friday 27 May 2011

విఘ్నపతి స్తుతి

Get this widget | Track details | eSnips Social DNA
                                               
అమరుల్ జన్మదినంబునాడు నను నాహ్వానించి యర్చించు                          
ప్రమితాభీష్టములైన యా  కుడుములుండ్రాళ్లేన్ భుజింపంగ, భా       
 రముగా మూషిక మీడ్చుచుండ,నగెఁ దారానాథుఁ డాదృష్టిదో      
 షమునన్ విచ్చిన పొట్ట కుట్టెనని యా శర్వాణికిం జెప్పు             
 స్తిముఖున్ గొల్చెదసిద్ధిబుద్ధికరునిన్ చేతోంబుజస్వచ్ఛునిన్
 డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Tuesday 10 May 2011

భువనవిజయము
































కలియుగ వైకుంఠ సదస్సు లో శ్రీ కృష్ణదేవరాయలు గా ౨౨/౦౪/౧౯౯౪,రాజమహేంద్రవరం 
భారతావరణం రూపకం లో మంత్రి గా, 1998
రాయల విజయం లో రామరాజభూషణుని గా 
గౌతమీ విజయం 2003,రాజమహేంద్రవరం .
భువన విజయం లో అయ్యలరాజు రామభద్రుని గా ౨/౦౧/౨౦౦౨,ఏలూరు .
రఘునాథ రాయలు సభ లో రఘునాథరాయలు గా,రాజమహేంద్రవరం .
భువనవిజయం లో రామరాజభూషనుడి గా ,పెద్దాపురం