audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday 29 June 2011

"పద్మ విభూషణ" శ్రీ వావిలాల


వరలు నమరావతీస్తూప వైభవంబు
వెలుగు కోహినూర్ వజ్రంపు విమలకాంతి
"వావిలాల" ధీ విభవంబు వసుధ కొసగి
రాణకెక్కె "సత్తెనపల్లి" రత్నగర్భ.

పదవీ వ్యామోహరహిత !
సదమల హృదయా ! వివేక సౌజన్యనిధీ !
సదయా ! "పద్మవిభూషణ !"
హృదయాంజలి, మధుర వాగ్మి ! యింపుగ గొనుమా !

నీదు నిర్మోహ నిస్స్వార్థ నిర్భయతలు
నీ నిరాడంబర హృదయ నిర్మలతలు
నీదు నిష్కర్ష వచనంబు నిశితదృష్టి
మందునకు లేవు ప్రభువులకు మాన్యచరిత !

అల గంజాయి వనములో తులసి మొక్కట్లీవు దుర్నీతిమం
తుల కౌటిల్యపు రాజకీయములలో తోరంపు టౌన్నత్యముల్
నిలుపం జాలిన నిర్మలుండ వవురా ! నీరాజనం  బిచ్చి నిన్
గొలుచున్ జాతి కృతజ్ఞతాంజలులతో గోపాలకృష్ణాహ్వయా !

గాంధేయవాదియై కదనభూమిని దూకి
       సత్యాగ్రహంబులు సల్పె నెవడు ?
భూదాన యజ్ఞంబు స్ఫూర్తితో నడపిన
       యల వినోబా యనుయాయి యెవడు ?
అధికార భాషా సమాఖ్య కధ్యక్షుడై
        తెలుగు తల్లిని భక్తి గొలిచె నెవడు ?
గ్రంథాలయోద్యమ కార్యక్రమంబులు
       నీటుగా నడపిన మేటి యెవడు ?
అట్టి స్వాతంత్ర్య యోధున, కట్టి సంఘ
సేవకున కేటికోళ్ళిడి సేవ చేసి
యాతని "నవతి ప్రవేశ మహంబు" నెరపి
ఘనత నందె రాజమహేంద్రి జనత నేడు.
(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి "నవతి ప్రవేశ మహోత్సవ"
సందర్భమున రచించి గానము చేసినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

ఆచార్య సినారె.


విరిపరిమళ మాహ్వానించు విధమున మక
రందమును జుఱ్ఱినట్లు, మాకందఫలము
నారగించు పగిది తృప్తి నందజేసి
హాయి గొల్పు కదోయి నీ గేయకవిత.

పలికిన పలుకగు గేయము,
ఎలకోయిల తీయని పలుకే యనిపించున్
జలధర గర్జనము పగిది
నలరించును నీదు వాక్కు లనుపమ రీతిన్.

కోకిల మాలపించు తన కోమలగీతి వసంత మందె; యీ
కోకిల విందుసేయు తన కోమలగీతుల నిత్య చైత్రమై ;
ఆ కృషికుండు కాలవశుడై వ్యవసాయము సేయ; చేయడే
ఈ కవికర్షకాగ్రణి యథేచ్చ నిరంతర పద్యసేద్యమున్.

నవ్య చైతన్యమూర్తివి నవకవులకు
భవ్యదీప్తివి వైదుష్య భావుకులకు;
"నవ్వని పువు" గాంచిన యో "సినారె !"నేడు
విశదమయ్యె "విశ్వంభర" విశ్వమూర్తి.

ముంగురు లసియాడు మురిపాలవదనుడై
           చూపఱు లోగొను రూపి యెవడు ?
తెలుగుదనంబది తేటపడునటుల
          దర్శనీయాంబరధారి యెవడు ?
చిఱునవ్వు వెన్నెల చిందించు మోముతో
         నెదుటి వ్యక్తిని పల్కరించు నెవడు ?
తెలుగు వెలుంగులు దేశవిదేశాల
         ప్రసరింపజేసిన ప్రముఖు డెవడు ?
"జ్ఞానపీఠ" పురస్కృతి సత్కృతుండు
నిత్యనూతన చైతన్య నిరతు డెవడు ?
అట్టి ఆచార్యు, కవివరు నాదరించి
ఘనతనొందె రాజమహేంద్ర జనత నేడు.
(ది. ౨.౯.౧౯౯౦ తేదిని శ్రీ బలుసు సర్వారాయ పురస్కారాన్ని డా. సి. నారాయణరెడ్డి గారికి
అందజేసిన సందర్భంగా రచించినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
 

Tuesday 28 June 2011

"మహాకవి" శ్రీ మధునాపంతుల


గురువృత్తిం గొని, తెల్వి జోతి నిడి, మీకుం పేరు తేజాలు ప
ల్వురు శిష్యోత్తములన్ గడించితిరి; యీ లోకంబె ధన్యంబగున్
చిరతేజా ! మిము గాంచి; మీరు ఋషులో ! సిద్ధార్థులో ! "నానృషిః
కురుతే కావ్య" మటన్న పండితుల సూక్తుల్ గూర్పవే నిశ్చితుల్.

అర్వాచీన మశాశ్వతంబు రసశూన్యంబౌ కవిత్వం బిలన్
దుర్వారంబుగ తాండవించు తఱి చేతోమోదమౌ కావ్యమున్
సర్వామోదముగారచించితిరి శశ్వత్కీర్తి ! నిద్రాణమున్
నిర్వీర్యంబగు జాతి చేతనముగా నిత్యమ్ము భాసిల్లగన్.

ధన్యుడ, "వాంధ్రి" పత్రికను స్థాపన జేసిన దేశభక్తమూ
ర్ధన్యుడ, "వాంధ్ర పద్య కవితా" వరివస్యకు స్ఫూర్తి, వాత్మచై
తన్యుడ, "వాంధ్ర కల్హణ !" సుధామధురాంధ్ర పురాణకర్త !" స
మ్మాన్యుడ, వాశిషం బొసగుమా ! "కలభాషిణి" కిన్ "మహాకవీ !"

ఆంధ్రుల భుజశక్తి, యతులిత ఘనకీర్తి
      వీనుల విందుగా వినిచె నెవడు ?
ఆంధ్ర కళాలక్ష్మి యందాలు చిందగా
      స్థిరరూప మిచ్చిన శిల్పి యెవడు ?
మచ్చున కేనియు పెచ్చుమాటాడని
      పరహిత మృదు మితభాషి యెవడు ?
ఆడంబరము లేని యతి సాధుమూర్తియై
      యొరుల జోలికి పోని యోగి యెవడు ?

అట్టి యకలంక మధుమూర్తి ! యనఘకీర్తి !
రాణ్మహేంద్ర పురీంద్ర గౌరవ పతాక !
సరస సత్యనారాయణశాస్త్రి సుకవి !
దివము నందుండి యాశీర్వదింపు మెపుడు.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతి రాజ్యలక్ష్మి !"




కొమ్మల కొమ్మవై, అనదగుమ్మల బాముల బాప నమ్మవై,
పిమ్మట రాజ్యలక్ష్మివయి, పేదల పాలిటి భాగ్యలక్ష్మివై,
సమ్మదమంద గూర్చితివి జంటల పెండిలి పేరటాలివై,
యెమ్మెయి తీఱు నీదు ఋణ మిమ్మహి ? తీఱదు జన్మజన్మలన్.

"కన్నప్రేమ" కన్నమిన్న "పెంచిన ప్రేమ"
యన్న సూక్తి నిక్క మయ్యెనమ్మ !
మీకు సంతు లేమి లోకుల భాగ్యమ్ము
జాలి పంట పండె జంట యెదల.

మూగవోయిన వీణలు మ్రోగ గల్గె,
వాడిపోయిన కుసుమాలు వాసి గాంచె
ప్రాజ్య కారుణ్య వారాశి ! "రాజ్యలక్ష్మి !"
ధన్య మానవతామూర్తి ! మాన్య కీర్తి !

దిక్కు మొక్కును లేక దీన స్థితిని గుందు
        సారసాక్షుల ప్రీతి సాకు నేర్పు,
ముక్కుపచ్చారని మురిపాలు నేరని
        బాల వితంతుల నేలు నేర్పు,
గాజుల పూవుల మోజు తీరని ముగ్ధ
        తరుణాబ్జముఖుల నోదార్చు నేర్పు,
"వంటయింటికె", "చంటిపాపలకే యింతి,
        చదువేల ?" యనువారి నెదురు నేర్పు,

తల్లి ! నీ కివి జన్మజాత సుగుణంబు
లట్టి నీచేత మగడు విఖ్యాతి మెఱసె
భర్తృభావానుకూలశుంభత్ప్రవృత్తి !
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

(శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మిగారి౧౨౫ వ జయంత్యుత్సవం
సందర్భంగా ది.౧౫.౧౧.౧౯౭౫ తేదీని జరిగిన సభలో గానం చేసినవి.)
 డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

తరు వేదన


"చల్లని నీడ నిచ్చి కడు చల్లని గాలుల సేద దేర్చుచున్
తల్లి వలెన్ ఫలంబు లిడి తాపము నాకలి తీర్చుచున్
పెల్లగు తాల్మి తోడ మది భేద మదేమియు లేక సాకుచున్
నెల్లరి యుల్లముల్ తనుపు నిట్టి మమున్ వధియింప న్యాయమే !"

"మానుల పెంచి యాకసము మక్కువ ముద్దులు వెట్టనెంచు మా
మేనులు గొడ్డటన్ నఱికి మిక్కిలి చేతులు కోసి కోసి నె
మ్మేనులు చీల్చి ఱంపముల, మేకులు కొట్టియు, పట్టి చిత్రికల్
మానవ ! తోమి తోమి దయమాలి వధింతురు దారుణంబుగన్."

"బిడ్డల వోలె సాకి కడు ప్రేమను పెంచిన గొడ్డు గోదలన్
దుడ్డున కొక్క వ్రేట తల ద్రుంచు కసాయికి నమ్మునట్లుగా
బిడ్డల వోలె సాకి మము పెంచి బలిష్ఠముగాగ సొమ్ముకై
గొడ్డలి పాలు చేయుదురు క్రూర గతిన్ మమతా విహీనతన్."

"మేనులు బాసి పెంచుదుము మీ గృహసీమల వన్నె వాసి, మీ
మేనులు మోసి పంచుదుము మీకు మహా సుఖభోగరాశి, మీ
మేనులు మూసి మానమును మెండుగ గూర్చెడు నంబరంబులన్
లోన భరించు మమ్ముల కనుంగొన రెంత కృతఘ్నభావమో !"

"చల్లని నేలతల్లి యొడి చక్కగ చేరిన నాటి నుండియున్
మెల్లగ రోజు రోజునకు మేనులు పెంచుచు కేలు చాచుచున్
చల్లని పిల్లగాలిచెలి చక్కిలిగింతల డోల లూగు మ
మ్మల్లరి పెట్టగాదగునె ? యాకులు, కొమ్మలు దూసి కోసియున్."

"దినదిన గండమై బ్రతుకు దీనుల పాలిట జాలి చూపకన్
చెనకుట క్రీడ కొందరి కిసీ ! పలు దోమగ కొమ్మలన్ పుటు
క్కున విఱుపంగ క్రీడ మఱి కొందరికిన్; పసులే నయంబు క్షు
త్తను ననలంబు బాపుకొన నాకులె మేయును హాని చేయకన్."

"సంతతి పెంపు సేయు ఋతుచక్ర సమాగత హర్షవేళలన్
హంతకులట్లు పిండముల నంతము సేసి తదీయ సారమున్
ముంతల బొట్టు బొట్టులుగ మొత్తము పట్టుచు మత్తుమీర సే
వింతురు వ్యగ్రచిత్తులయి వీరవిహార వినోదకాములై."

"కుత్తుక కత్తితో సగము కోయుచు, కోయుచు లొట్టిగట్టి మా
నెత్తురు చుక్క చుక్కలుగ నిచ్చలు పిండుకు త్రావుచున్ కడున్
మత్తిలి దారపుత్రులను మాపులు రేపులు బాధ పెట్టుటన్
ఉత్తమ చిత్తహింస ద్విగుణోధ్దుర మౌచు ధరన్  కలంపదే ?"

"మందులు, మాకులున్, ఫలసుమంబులు, పత్రసమూలకాండముల్
డెందము సంతసింప నిబిడీకృతశక్తులు ధారవోసి మీ
కందుల,వృధ్ధులన్, మరణకామిని కౌగిట చిక్కు రోగులన్
పొందగ నాయురున్నతులు ప్రోతుము; మమ్ముల నొంచుటొప్పునే ?"
[ధాతృ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వ విద్యాలయంలో ఆచార్య సి.రమణయ్యగారి అధ్యక్షతను నిర్వహింప
బడిన కవిసమ్మేళనంలో గానం చేసినవి.]
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Sunday 26 June 2011

మిత్తి దయ్యము



"పున్నమ చందమామ సరిపోలెడు ముద్దుల మోమువాడ ! నా
కన్నయ ! మిన్నయై మిగుల ఖ్యాతిని గూర్తు వటంచు నెన్న, నా
కన్నను మున్నె నీకిలను కాలము చెల్లిన" దంచు నేడ్చు నా
ఖిన్న ముఖాంబుజన్ గనవె ? ఖేదమె మోదమ మిత్తిదయ్యమా !

ముద్దులుగారు బాలకుని మొహనమూర్తిని గాంచుచున్ సదా
నిద్దపు జెక్కుటద్దముల నీడలు చూచుచు మోదమందుచున్
ప్రొద్దుపుచ్చు నా "యమకు" పుత్ర వియోగము గూర్చి నిర్దయన్
హద్దులు లేని శోకవిపులాంబుధి ముంచితి మిత్తిదయ్యమా !

ఒక్కడె పుత్రుడంచు నత డొక్కడె మా కుల ముధ్దరించు, వే
ఱొక్కడు సాటి లేడనగ నున్నతమౌ పద మందు నంచు వా
రక్కఱ తోడ పెంచి మది నాశలు పెంచుకొనంగ నక్కటా !
యక్కటికంబు లేక యిటు లంతము చేయుదె ? మిత్తిదయ్యమా !

"మీ నాన్నారు గతింపగా కుమిలి యీ మేనింక చాలింపగా
నే నెంచన్ భవదీయ బంధ మది నన్నీరీతి నిల్పెన్, సుతా !
నే నేరీతి వసింతు నింక " నని కన్నీరట్లు మున్నీరు కా
గా నిట్టూర్పుల నేడ్చు తల్లి యదిగో కన్పింపదే మిత్తిరో !

"ఇంతకు ముందె  యాడుకొన నేగుదు నమ్మ! యటంచు పల్కి, నీ
బంతియు బ్యాటు పట్టుకొని పాలను త్రాగితి కాదె నాయనా!
ఇంతట కాలసర్ప మది యేవిధి నిన్నిటు కాటు వేసె" నం
చెంతయు శోకతప్త యగు నింతిని గాంచితె ? మిత్తిదయ్యమా !

"వెళ్ళితివయ్య స్నేహితుని పెళ్ళికి, వెళ్ళినవాడ వక్కటా !
వెళ్ళినయట్లు రాక యట వెల్లువ నీట మునింగి నాకు క
న్నీళ్ళు మిగిల్చితయ్య ! నది నీటను గండము తోడ నీకు నూ
రేళ్ళును నిండెనా ? " యనుచు నేడ్చెడు తల్లిని గంటె ? మిత్తిరో !

"మల్లియ వంటి నీ మృదుల మానస వీణను మీటు భాగ్యమున్
పల్లియవంటి నీ పలుకుబాసలు విందులు గూర్చు భాగ్యమున్
వెల్లువవంటి నీ వయసు వేగము మక్కువ గొల్పు భాగ్యమున్
చెల్లయిపోయె " నంచు కడు చింతిలు ప్రేమికు గంటె మిత్తిరో !

"అంబుజనేత్ర ! యేగతి భవాంబుధి నీదగ జాలుదున్, వియో
గాంబుధి ముంచిపోతివి గదయ్య సుఖస్మృతులన్ మిగిల్చి రా
గాంబుధి నోలలార్చితివి హాయిగ నొక్క వసంత మౌర ! శో
కాంబుధి ముంచి" తం చడలు  కామిని గాంచితె మిత్తిదయ్యమా !

చేతికి నందివచ్చు సుతు జీతముతోడ ఋణంబు తీఱగా
కూతు నొకయ్య చేత నిడి  కోర్కెలు దీఱగ కృష్ణ ! రామ ! యం
చాతత భక్తి తోడ కడు హాయిని ప్రొద్దులు పుచ్చనెంచునే !
ఆతని ఆశలన్ని యడియాసల జేసితి మిత్తిదయ్యమా !

కోడలి కడ్పు పండమికి కుందుచు వంశము నిల్ప వేల్పులన్
వేడుచు నిష్ఠ నోములను పెక్కులు నోచగ జేసి నిచ్చలున్
కోడలి పుత్రునిన్ బనిచె కోరిక యాత్రలు చేయ, "మిత్తిరో !
కీడు ఘటించి మ్రింగి " తని ఖేదము నొందెడు "నామె" గంటివే !
  ( కీ.శే.  యస్.టి.వి. దీక్షితులు (చిన్న) ౨౯వ జయంత్యుత్సవమును పురస్కరిం
చుకొని ది.౨.౫.౧౯౯౪ తేదీని "యలమంచిలిలో ఆంధ్ర పద్య కవితాసదస్సు
ప్రధాన కార్యదర్శి, శ్రీ శిష్ట్లా వెంకట్రావుగారి స్వగృహ ప్రాంగణంలో నిర్వహింపబడిన
సభలో గానం చేయబడినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

కాలుష్యపు కోఱలలో

  
"కాలుష్యపు కోఱలలో
బేలగ జిక్కి విలవిల తపించు ధరిత్రిన్
ఏలా పట్టించుకొనవు ?
కాలుని కౌగిలికి నీవు కాతరపడవే ?"

"ఆలము దప్పు నాయుధము లంతములై ధర కంచు నెంచు ని
క్కాలము, భూ నభోంతరము కల్మషముం బొనరించి మృత్యువన్
గాలమునందు జిక్కి లయకాల మహోద్ధుర దండధారితో
మేలములాడు మానవుడ ! మిక్కిలి వెఱ్ఱివి గావె చూడగన్."

"స్వార్థము తోడ మానవుడ ! పబ్బములన్ గడుపంగ జూచి నీ
వార్థిక లాభముల్ గొని జనావళి స్వాస్థ్యములన్ పణంబుగా
వ్యర్థపదార్థముల్ విడచి పావన గౌతమి గర్భకోశమున్,
తీర్థము కల్మషంబుగ, విధించెదు వ్యాధినిరూఢలోకమున్."

"ఆఱు గాలము శ్రమియించు "నన్నదాత"
వరుణదేవుని కరుణకై యఱుత జాచి
చుక్క నీటికై యెంతేని సురుగు వేళ
గోటి చుట్టుపై రోకటి పోటు రీతి
నీటి కలక యన్ సర్పంబు కాటు వేసె."

"గుండె గూడు కట్టుకున్న దుఃఖ దవాగ్ని
మండుచుండె మదిని మాడ్చుచుండె
కఱవు కాటకాలు కాటు వేయుచు నుండె
"అన్నదాత" వెతల కంతు కలదె ?"

పొలముల్ బీడుగ మారి పండకునికిన్ భోజ్యంబు పూజ్యంబుగాన్
జల లేశంబులు కాల్వలున్ జెఱువులున్ సంపూర్ణ కాలుష్యమై
జలమున్ కూడును లేమి చేత బ్రతుకున్ జాలింప యత్నించు కొ
య్యలు రైతన్నలు; హేతుభూతములు కర్మాగార కాలుష్యముల్."

"చండమార్తాండ రోచి ప్రచండ బహుళ
నీలలోహిత కిరణముల్ నింగి బర్వి
హాని కలిగింపకుండగా ప్రాణికోటి
సహజ రక్షణ కవచంబు సాకుచుండు."

"తేజోమూర్తి ప్రభాకరాంశువుల యుద్దీప్తుల్ ప్రబాధింపకన్
"ఓజోనన్" పొర కాచుచుండు ధర, నీవో ! యా పొరన్ తూట్లుగాన్
బేజారెత్త జనుల్, విషానిలములన్ బ్రేరేచి పంపించుచున్
భూజీవాతు సమగ్ర వాయు పరిధిన్ పోకార్చి క్రీడింతువా ?

" "జరదాకిళ్ళి" బిగించి నోట "రజనీ స్టైల్" తో "సిగార్" కాల్చుదాం
సరదాగా" నని నేస్తగాండ్రు పలుకన్ "సై" యంచు "స్మోకింగుకున్"
సరదా బానిసయౌచు నీ యువత కష్టాలన్ వరించుంగదే !
పరదా గప్పుచు తల్లిదండ్రులకు, నాహ్వానించు రోగంబులన్."

"కానల గాల్చివేసి తన కాష్ఠము తానుగ వేల్చుచుండె నీ
మానవు డెంత వెఱ్ఱి ? పొగ మానడు, గుప్పున ప్రక్కవానిపై
మానక రింగు లూదుచు ప్రమాదభరంబుగ జేయుచుండె నీ
మానవ జీవనం బకట మానిసి యెంతటి స్వార్థజీవియో !"

"మోటరు వాహనంబుల " నమూల్యము" జేయుచు జీవితంబులన్
నాటికి నాటి కాయువును నష్టము జేయుచు నుంటి మానవా !
కాటికి కాళ్ళు చాచుకొని కాలుని పిల్చుట చోద్యమయ్య ! నీ
కేటికి బుద్ధి రాదు ? ధర నేగతి రక్షణ నేడు సేయుదో ?

"ఎన్నో యేండ్లుగ బాటసారులకు తానిచ్చున్ మహాఛాయలన్
ఎన్నో పక్షుల కాలవాల మయి, యింకెన్నో లఘు ప్రాణులన్
ఎన్నో యేండ్లుగ సేద దేర్చుచును రక్షించున్; కటా ! బాటకై
ఎన్నో యేండ్లుగ నాశ్రయం బొసగు తద్వృక్షంబులన్ గూల్పగా,
నెన్నో యేండ్లుగ నున్న ప్రాణు లవి దిక్కే లేని పక్షుల్ గదా !"

"కూలిన చెట్టు నుండి పడె గూండ్లును, రెక్కలురాని పిల్లలున్
జాలిగ తల్లిపక్షు లట చాలగ తిర్గెను తల్లడిల్లుచున్
రాలిన పండ్ల వోలె బడి ప్రాకెను బల్లులు ప్రాణ భీతితో
తూలిన పుల్ల లేఱుకొను తొందఱ నుండిరి కొంద రత్తఱిన్."

"అది హృదయ విదారక దృశ్య, మది మది కద
లించెడు ఘటన, మది వెల్లడించు నరుడ !
నీవు కూర్చున్న కొమ్మను నీవె నఱకు
చాల వెఱ్ఱివి కఱకు కసాయి వనుచు."

"ఏళ్ళ తరంబడి యూడలె
వేళ్ళై, యవి వృక్షము లయి విస్తరణముచే
మేళ్ళొసగు వటవిటపులన్
త్రెళ్ళన్ వ్రేయ మన సెట్లు ప్రేరించు నయా !"

""జాలిని వీడి పుష్ప ఫల శాఖల పచ్చగ నున్న మమ్ములన్
గూలగనేయు పాపు" లని కోపము జెందక వంట కట్టెలన్,
మేలగు వస్తువుల్, కలప, మీదు గృహంబుల నందగించి, మీ
కాలము చెల్లగా, చితికి కాష్ఠము లిచ్చుచు మేలు గూర్పమే ?"

"దొంగలు మమ్ములన్ నఱకి దుంగల దోచుటె గాక, నిచ్చలున్
 బంగరు పంట పండుటకు, పచ్చదనాలకు హేతువౌ ప్రకృ
త్యంగన నిత్యశోభకు నిధానము వర్షము; తన్నిరోధకుల్
తింగరబుచ్చులై స్వయము తీసిన గోతను కూల గోరరే ?"

"మందులు, మాకులున్. ఫలసుమంబులు, పత్ర సమూల కాండముల్
డెందము సంతసింప నిబిడీకృతశక్తులు ధారవోసి మీ
కందుల, వృద్ధులన్, మరణ కామిని కౌగిట జిక్కు రోగులన్
పొందగ నాయురున్నతులు ప్రోతుము; మమ్ము వధించు టొప్పునే ?"

"మాదగు మూగ వేదనను మానసమందు దలంపరేల ? మా
వేదన కేమి ? మీరు కడు విజ్ఞులు పొంచిన ముప్పు గాంచరే ?
మేదిని చండ భాస్కరుని మిక్కుట తాపము నెట్టు లోర్చునో !
పాదపఖండనంబు తమ పాలిట శాప మటంచు నెంచరే ?"
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Thursday 23 June 2011

మాతృ భాష

  ఆపాత మధురమై యానందమందించు                                                                               
 దివ్య వాక్సతి మన తెనుగుభాష,                                                                                     
 ఆలోచనామృతమై ఆనందమందించు                                                                                 
 తియ్యందనంబుల తెనుగుభాష,
                                             
 జగతినజంతభాషగ కీర్తి గడియించు                                         
 తేటతెలుగునుడుల తెనుగుభాష,                                            
 సరసాంగి యనుకూల సరళయై యొదిగెడు                                   
 దేవభాషాపుత్రి తెనుగుభాష

                                                 
 అట్టి భాష నేర్చుకొనుట యట్టి దేశ                                         
 మందు పుట్టుటయునునన్న నల్ప ఫలమె?                              
 అది తపఃఫలంబనుట యథార్థ మయ్య !                                                                                         
 మాతృభాషను సేవించి మనగదయ్య

కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లె తోట,
తేటిపాట, నెమలియాట,తెనెయూట                                                                                       
జగతిని తెనుగు మాటకు సాటి్ రావు.
                                                                                                               
 తే.గీ. చలువ వెన్నెలయు,జిలుగు వలువ, చెలియ                                                                
 కులుకు, కలువచెలువమును,చిలుక పలుకు,                                                                  
 మలయ పవనంబు, సెలయేటి కలరుతంబు                                                                      
 తులయగునె యిలను తెలుగు పలుకుబడికి.                       

పరిరక్షించెను పూర్వ సంస్కృతి కళాపారమ్య రమ్యాకృతిన్
వరలెన్నీత్యుపదేశ వాఙ్మధురస స్వాదుత్వసంపన్నయై,
తరుణీసమ్మిత కావ్యసౌరభలసత్సన్తుష్ట దిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాలపద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే
(ది.౨౪.౨.౨౦౦౨ తేదీని కాకినాడలో జరిగిన "తెలుగు పండుగ" లో పఠించినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Wednesday 22 June 2011

ఓంకార మాహాత్మ్యం

ఆ,ఊ,మ వర్ణాల యైక్యనాదంబుగా
          సత్తు చిత్తును దేని స్తవము సేయు,
ప్రణవనాదం బంచు పాపహరణ మంచు
          భక్త కోటులు దేని ప్రణుతి సేయు,
అల్ల పరబ్రహ్మ కాదిరూప మనుచు
          విజ్ఞు డెద్దానిని వినుతి సేయు,
బ్రహ్మాండభాండ యంత్రధ్వనిగా నెంచి
          మునిగణం బెద్దాని ముద్దు సేయు,
సప్తచక్రాల నెద్దాని స్పందనమును
గురుమునీంద్రులు జలరాశి ఘోషణముగ
వేణు వీణా రవంబుగా వినుచు నుందు
రట్టి "యోంకారము" జపింతు నధిక భక్తి.
       డా .యస్వీ  రాఘవేంద్ర రావు .              
Get this widget | Track details | eSnips Social DNA 



Thursday 16 June 2011

వసివాడు పసి మొగ్గలు

వసివాడు పసి మొగ్గలు కవితా ఖండిక జిల్లా కవి సమ్మేళనం కార్యక్రమమం లో13/03/2000 న హైదరాబాద్ దూరదర్శన్ నుండి ప్రసారమైనది.

స్వాగత సంక్రమణం.

స్వాగత సంక్రమణం పద్య కవిత రాజమహేన్ద్రవరమ్ సిటే కేబుల్ నున్డి  15/01/2008 న  ప్రసారమైనది.  

Friday 10 June 2011

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 5( కబీర్ వేమన ల భావస్వామ్యం),


Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి కబీర్ వేమన ల భావస్వామ్యం   ప్రసంగమ్ 18/07/1990 ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి ప్రసారమ్ అయునది.

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 4(తెలుగు లొ చాటు పద్యాలు)



Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి తెలుగు లొ చాటు పద్యాలు   ప్రసంగమ్ ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి   ప్రసారమ్  అయునది.

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 3(ఆంధ్ర పురాణ.....)


Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి ఆంధ్ర పురాణ..... ప్రసంగమ్ ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి   ప్రసారమ్  అయునది.

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 2(పద్యం తెలుగు వాడి ఆస్తి)


Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి పద్యం తెలుగు వాడి  ఆస్తి ప్రసంగమ్ ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి   ప్రసారమ్  అయునది.

డా .యస్వీ రాఘవేంద్ర రావు ఆకాశవాణి ప్రసంగాలు 1(ధూర్జటి సామాజిక స్ప్రుహ)


Get this widget | Track details | eSnips Social DNA

డా .యస్వీ  రాఘవేంద్ర రావు గారి ధూర్జటి సామాజిక స్ప్రుహ  ప్రసంగమ్ ఆకాశవాణి విశాఖపట్నమ్ కేన్ద్ర్ం నున్డి   ప్రసారమ్  అయునది.


Friday 3 June 2011

వేయేన్డ్ల తెలుగు సాహిత్యమ్

                
 పరిరక్షించెను పూర్వ సంస్కృతి కళాపారమ్యరమ్యాకృతిన్
వరలెన్ నీత్యుపదేశ వాఙ్మధురస స్వాదుత్వ సంపన్నమై,                     
తరుణీ సమ్మిత కావ్యసౌరభ లసత్సంతుష్ట దిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాల పద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే. 

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
Get this widget | Track details | eSnips Social DNA వేఎండ్ల