విరిపరిమళ మాహ్వానించు విధమున మక
రందమును జుఱ్ఱినట్లు, మాకందఫలము
నారగించు పగిది తృప్తి నందజేసి
హాయి గొల్పు కదోయి నీ గేయకవిత.
పలికిన పలుకగు గేయము,
ఎలకోయిల తీయని పలుకే యనిపించున్
జలధర గర్జనము పగిది
నలరించును నీదు వాక్కు లనుపమ రీతిన్.
కోకిల మాలపించు తన కోమలగీతి వసంత మందె; యీ
కోకిల విందుసేయు తన కోమలగీతుల నిత్య చైత్రమై ;
ఆ కృషికుండు కాలవశుడై వ్యవసాయము సేయ; చేయడే
ఈ కవికర్షకాగ్రణి యథేచ్చ నిరంతర పద్యసేద్యమున్.
నవ్య చైతన్యమూర్తివి నవకవులకు
భవ్యదీప్తివి వైదుష్య భావుకులకు;
"నవ్వని పువు" గాంచిన యో "సినారె !"నేడు
విశదమయ్యె "విశ్వంభర" విశ్వమూర్తి.
ముంగురు లసియాడు మురిపాలవదనుడై
చూపఱు లోగొను రూపి యెవడు ?
తెలుగుదనంబది తేటపడునటుల
దర్శనీయాంబరధారి యెవడు ?
చిఱునవ్వు వెన్నెల చిందించు మోముతో
నెదుటి వ్యక్తిని పల్కరించు నెవడు ?
తెలుగు వెలుంగులు దేశవిదేశాల
ప్రసరింపజేసిన ప్రముఖు డెవడు ?
"జ్ఞానపీఠ" పురస్కృతి సత్కృతుండు
నిత్యనూతన చైతన్య నిరతు డెవడు ?
అట్టి ఆచార్యు, కవివరు నాదరించి
ఘనతనొందె రాజమహేంద్ర జనత నేడు.
(ది. ౨.౯.౧౯౯౦ తేదిని శ్రీ బలుసు సర్వారాయ పురస్కారాన్ని డా. సి. నారాయణరెడ్డి గారికి
అందజేసిన సందర్భంగా రచించినవి.)
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
No comments:
Post a Comment