వరలు నమరావతీస్తూప వైభవంబు
వెలుగు కోహినూర్ వజ్రంపు విమలకాంతి
"వావిలాల" ధీ విభవంబు వసుధ కొసగి
రాణకెక్కె "సత్తెనపల్లి" రత్నగర్భ.
పదవీ వ్యామోహరహిత !
సదమల హృదయా ! వివేక సౌజన్యనిధీ !
సదయా ! "పద్మవిభూషణ !"
హృదయాంజలి, మధుర వాగ్మి ! యింపుగ గొనుమా !
నీదు నిర్మోహ నిస్స్వార్థ నిర్భయతలు
నీ నిరాడంబర హృదయ నిర్మలతలు
నీదు నిష్కర్ష వచనంబు నిశితదృష్టి
మందునకు లేవు ప్రభువులకు మాన్యచరిత !
అల గంజాయి వనములో తులసి మొక్కట్లీవు దుర్నీతిమం
తుల కౌటిల్యపు రాజకీయములలో తోరంపు టౌన్నత్యముల్
నిలుపం జాలిన నిర్మలుండ వవురా ! నీరాజనం బిచ్చి నిన్
గొలుచున్ జాతి కృతజ్ఞతాంజలులతో గోపాలకృష్ణాహ్వయా !
గాంధేయవాదియై కదనభూమిని దూకి
సత్యాగ్రహంబులు సల్పె నెవడు ?
భూదాన యజ్ఞంబు స్ఫూర్తితో నడపిన
యల వినోబా యనుయాయి యెవడు ?
అధికార భాషా సమాఖ్య కధ్యక్షుడై
తెలుగు తల్లిని భక్తి గొలిచె నెవడు ?
గ్రంథాలయోద్యమ కార్యక్రమంబులు
నీటుగా నడపిన మేటి యెవడు ?
అట్టి స్వాతంత్ర్య యోధున, కట్టి సంఘ
సేవకున కేటికోళ్ళిడి సేవ చేసి
యాతని "నవతి ప్రవేశ మహంబు" నెరపి
ఘనత నందె రాజమహేంద్రి జనత నేడు.
(శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి "నవతి ప్రవేశ మహోత్సవ"
సందర్భమున రచించి గానము చేసినవి.)
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
No comments:
Post a Comment