audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday, 26 June 2011

కాలుష్యపు కోఱలలో

  
"కాలుష్యపు కోఱలలో
బేలగ జిక్కి విలవిల తపించు ధరిత్రిన్
ఏలా పట్టించుకొనవు ?
కాలుని కౌగిలికి నీవు కాతరపడవే ?"

"ఆలము దప్పు నాయుధము లంతములై ధర కంచు నెంచు ని
క్కాలము, భూ నభోంతరము కల్మషముం బొనరించి మృత్యువన్
గాలమునందు జిక్కి లయకాల మహోద్ధుర దండధారితో
మేలములాడు మానవుడ ! మిక్కిలి వెఱ్ఱివి గావె చూడగన్."

"స్వార్థము తోడ మానవుడ ! పబ్బములన్ గడుపంగ జూచి నీ
వార్థిక లాభముల్ గొని జనావళి స్వాస్థ్యములన్ పణంబుగా
వ్యర్థపదార్థముల్ విడచి పావన గౌతమి గర్భకోశమున్,
తీర్థము కల్మషంబుగ, విధించెదు వ్యాధినిరూఢలోకమున్."

"ఆఱు గాలము శ్రమియించు "నన్నదాత"
వరుణదేవుని కరుణకై యఱుత జాచి
చుక్క నీటికై యెంతేని సురుగు వేళ
గోటి చుట్టుపై రోకటి పోటు రీతి
నీటి కలక యన్ సర్పంబు కాటు వేసె."

"గుండె గూడు కట్టుకున్న దుఃఖ దవాగ్ని
మండుచుండె మదిని మాడ్చుచుండె
కఱవు కాటకాలు కాటు వేయుచు నుండె
"అన్నదాత" వెతల కంతు కలదె ?"

పొలముల్ బీడుగ మారి పండకునికిన్ భోజ్యంబు పూజ్యంబుగాన్
జల లేశంబులు కాల్వలున్ జెఱువులున్ సంపూర్ణ కాలుష్యమై
జలమున్ కూడును లేమి చేత బ్రతుకున్ జాలింప యత్నించు కొ
య్యలు రైతన్నలు; హేతుభూతములు కర్మాగార కాలుష్యముల్."

"చండమార్తాండ రోచి ప్రచండ బహుళ
నీలలోహిత కిరణముల్ నింగి బర్వి
హాని కలిగింపకుండగా ప్రాణికోటి
సహజ రక్షణ కవచంబు సాకుచుండు."

"తేజోమూర్తి ప్రభాకరాంశువుల యుద్దీప్తుల్ ప్రబాధింపకన్
"ఓజోనన్" పొర కాచుచుండు ధర, నీవో ! యా పొరన్ తూట్లుగాన్
బేజారెత్త జనుల్, విషానిలములన్ బ్రేరేచి పంపించుచున్
భూజీవాతు సమగ్ర వాయు పరిధిన్ పోకార్చి క్రీడింతువా ?

" "జరదాకిళ్ళి" బిగించి నోట "రజనీ స్టైల్" తో "సిగార్" కాల్చుదాం
సరదాగా" నని నేస్తగాండ్రు పలుకన్ "సై" యంచు "స్మోకింగుకున్"
సరదా బానిసయౌచు నీ యువత కష్టాలన్ వరించుంగదే !
పరదా గప్పుచు తల్లిదండ్రులకు, నాహ్వానించు రోగంబులన్."

"కానల గాల్చివేసి తన కాష్ఠము తానుగ వేల్చుచుండె నీ
మానవు డెంత వెఱ్ఱి ? పొగ మానడు, గుప్పున ప్రక్కవానిపై
మానక రింగు లూదుచు ప్రమాదభరంబుగ జేయుచుండె నీ
మానవ జీవనం బకట మానిసి యెంతటి స్వార్థజీవియో !"

"మోటరు వాహనంబుల " నమూల్యము" జేయుచు జీవితంబులన్
నాటికి నాటి కాయువును నష్టము జేయుచు నుంటి మానవా !
కాటికి కాళ్ళు చాచుకొని కాలుని పిల్చుట చోద్యమయ్య ! నీ
కేటికి బుద్ధి రాదు ? ధర నేగతి రక్షణ నేడు సేయుదో ?

"ఎన్నో యేండ్లుగ బాటసారులకు తానిచ్చున్ మహాఛాయలన్
ఎన్నో పక్షుల కాలవాల మయి, యింకెన్నో లఘు ప్రాణులన్
ఎన్నో యేండ్లుగ సేద దేర్చుచును రక్షించున్; కటా ! బాటకై
ఎన్నో యేండ్లుగ నాశ్రయం బొసగు తద్వృక్షంబులన్ గూల్పగా,
నెన్నో యేండ్లుగ నున్న ప్రాణు లవి దిక్కే లేని పక్షుల్ గదా !"

"కూలిన చెట్టు నుండి పడె గూండ్లును, రెక్కలురాని పిల్లలున్
జాలిగ తల్లిపక్షు లట చాలగ తిర్గెను తల్లడిల్లుచున్
రాలిన పండ్ల వోలె బడి ప్రాకెను బల్లులు ప్రాణ భీతితో
తూలిన పుల్ల లేఱుకొను తొందఱ నుండిరి కొంద రత్తఱిన్."

"అది హృదయ విదారక దృశ్య, మది మది కద
లించెడు ఘటన, మది వెల్లడించు నరుడ !
నీవు కూర్చున్న కొమ్మను నీవె నఱకు
చాల వెఱ్ఱివి కఱకు కసాయి వనుచు."

"ఏళ్ళ తరంబడి యూడలె
వేళ్ళై, యవి వృక్షము లయి విస్తరణముచే
మేళ్ళొసగు వటవిటపులన్
త్రెళ్ళన్ వ్రేయ మన సెట్లు ప్రేరించు నయా !"

""జాలిని వీడి పుష్ప ఫల శాఖల పచ్చగ నున్న మమ్ములన్
గూలగనేయు పాపు" లని కోపము జెందక వంట కట్టెలన్,
మేలగు వస్తువుల్, కలప, మీదు గృహంబుల నందగించి, మీ
కాలము చెల్లగా, చితికి కాష్ఠము లిచ్చుచు మేలు గూర్పమే ?"

"దొంగలు మమ్ములన్ నఱకి దుంగల దోచుటె గాక, నిచ్చలున్
 బంగరు పంట పండుటకు, పచ్చదనాలకు హేతువౌ ప్రకృ
త్యంగన నిత్యశోభకు నిధానము వర్షము; తన్నిరోధకుల్
తింగరబుచ్చులై స్వయము తీసిన గోతను కూల గోరరే ?"

"మందులు, మాకులున్. ఫలసుమంబులు, పత్ర సమూల కాండముల్
డెందము సంతసింప నిబిడీకృతశక్తులు ధారవోసి మీ
కందుల, వృద్ధులన్, మరణ కామిని కౌగిట జిక్కు రోగులన్
పొందగ నాయురున్నతులు ప్రోతుము; మమ్ము వధించు టొప్పునే ?"

"మాదగు మూగ వేదనను మానసమందు దలంపరేల ? మా
వేదన కేమి ? మీరు కడు విజ్ఞులు పొంచిన ముప్పు గాంచరే ?
మేదిని చండ భాస్కరుని మిక్కుట తాపము నెట్టు లోర్చునో !
పాదపఖండనంబు తమ పాలిట శాప మటంచు నెంచరే ?"
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

No comments:

Post a Comment