కొమ్మల కొమ్మవై, అనదగుమ్మల బాముల బాప నమ్మవై,
పిమ్మట రాజ్యలక్ష్మివయి, పేదల పాలిటి భాగ్యలక్ష్మివై,
సమ్మదమంద గూర్చితివి జంటల పెండిలి పేరటాలివై,
యెమ్మెయి తీఱు నీదు ఋణ మిమ్మహి ? తీఱదు జన్మజన్మలన్.
"కన్నప్రేమ" కన్నమిన్న "పెంచిన ప్రేమ"
యన్న సూక్తి నిక్క మయ్యెనమ్మ !
మీకు సంతు లేమి లోకుల భాగ్యమ్ము
జాలి పంట పండె జంట యెదల.
మూగవోయిన వీణలు మ్రోగ గల్గె,
వాడిపోయిన కుసుమాలు వాసి గాంచె
ప్రాజ్య కారుణ్య వారాశి ! "రాజ్యలక్ష్మి !"
ధన్య మానవతామూర్తి ! మాన్య కీర్తి !
దిక్కు మొక్కును లేక దీన స్థితిని గుందు
సారసాక్షుల ప్రీతి సాకు నేర్పు,
ముక్కుపచ్చారని మురిపాలు నేరని
బాల వితంతుల నేలు నేర్పు,
గాజుల పూవుల మోజు తీరని ముగ్ధ
తరుణాబ్జముఖుల నోదార్చు నేర్పు,
"వంటయింటికె", "చంటిపాపలకే యింతి,
చదువేల ?" యనువారి నెదురు నేర్పు,
తల్లి ! నీ కివి జన్మజాత సుగుణంబు
లట్టి నీచేత మగడు విఖ్యాతి మెఱసె
భర్తృభావానుకూలశుంభత్ప్రవృత్తి !
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !
(శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మిగారి౧౨౫ వ జయంత్యుత్సవం
సందర్భంగా ది.౧౫.౧౧.౧౯౭౫ తేదీని జరిగిన సభలో గానం చేసినవి.)
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
లలిత పద గుంఫనంబును
ReplyDeleteవిలసద్గతి గల్గు శైలి పృథుభావములం
బలికించెడి పద్యాచా
ర్యులు గద శ్రీ రాఘవేంద్ర రావుకు ప్రణతుల్.
శంకరయ్యగారూ! నమస్తే!
ReplyDeleteనేను రచించిన "రమ్యగుణలక్ష్మి! శ్రీమతి రాజ్యలక్ష్మి! " కవితా ఖండిక మీరు దర్శించినందులకు
నా కృతజ్ఞతాంజలి! మీ "శంకరాభరణం" బ్లాగు కడు రమణీయంగా ఉంది. సమస్యాపూరణలు, దత్తపదులు,
చమత్కార పద్యాదులు దర్శించాను.
"కమనీయమగు లలిత స
ద్విమర్శ కావించినట్టి విమల రసజ్ఞా!
సమకాలిక కవి మెచ్చెడు
రమణీయ సహృదయ! శంకరయ్యా! జోతల్."
భవదీయ,
డా.యస్వి.రాఘవేంద్రరావు (సుమశ్రీ)