సీ|| అధికారభాషాసమాఖ్య కధ్యక్షుడై
మాతృభాషనుగొల్చు మాన్యుడెవడు ?
"శీర్ణమేఖల" వంటి చిరకీర్తియుతమైన
కావ్యాలు వ్రాసిన కవి యెవండు ?
"అతిథిదేవోభవ!" యని యాదరించిన
మృదులహృదయ గృహమేధి యెవడు ?
తెలుగు పద్యమనిన, తెలుగు సంస్కృతి యన్న
మూపులు మూరెడౌ మూర్తి యెవడు ?
తే|| అట్టి మాతృభాషామూర్తి, కట్టి సుకవి,
కట్టి యాచార్యవర్యున, కట్టి ఘనున
కార్ష సంస్కృతి స్ఫూర్తి, కట్టి రామ
కృష్ణమాచార్యులకు నేను కేలు మోడ్తు.
తే|| సాంద్రకీర్తి ! నండూరి వంశాబ్ధిచంద్ర !
సార్థకంబయ్యె నీజన్మ సచ్చరిత్ర !
సుకవి ! జీవింపు ప్రజల నాలుకలయందు
అందుకోవయ్య ! నాదు శ్రధ్ధాంజలిదిగొ !
డా.యస్వీ రాఘవేంద్ర రావు
(డా||నండూరి రామకృష్ణమాచార్య సంస్మరణసభ ది.౨౭.౭.౨౦౦౩ తేదీని
రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో నిర్వహింపబడింది. ఆసందర్భంగా
పఠించినవి.)
No comments:
Post a Comment