నాటి సంప్రదాయముల కాణాచి పెండ్లి
మ. ఒక జాతిన్ నభివృద్ధి మార్గమున నెన్నో రంగముల్ నిల్పవే ?
వికసింపన్ ఘన సంస్కృతి ప్రచురతల్ విద్యాకళాసాహితీ
సకలం బూతము; తెల్గు సంస్కృతియు భాషాదీప్తి ప్రాచీనతన్
అకళంకంబుగ గాంచ గల్గినది; గణ్యంబయ్యె నాంధ్రాళియున్.
మ. పరమేశుండును, పాలకుండు, గురుడున్, పౌరుండు, సంస్కారమన్
వర సౌధానకు నాల్గు స్తంభములుగా ప్రాచీనధర్మంబులన్
పరిరక్షించిరి; బాధ్యతాయుతముగా బల్ మేళ్ళ, సత్పాలనన్,
పరమాశీస్సుల, కర్మలన్ నెఱపి నిల్పంజాలి రీ సంస్కృతిన్.
మ. "అతిథిన్" దేవుడటంచు జేయుదుము మర్యాదల్ సదాత్మీయతన్;
సత "మభ్యాగతు" విష్ణువంట మన సంస్కారంబ దాంధ్రావనిన్
క్రతుసామ్యాచరణానుపూర్విగ సదారాధ్యంబు; తత్సంస్కృతిన్
అతివల్ ! సాకుచు "నన్నపూర్ణ"లయి పూర్వాచారముల్ నిల్పుడీ !
ఉ. "రాకులు" "షేకు" లంచు నడిరాతిరి "క్లబ్బులు" "పబ్బు"లందునన్
సాకు, లసత్యముల్ బలికి చాలగ పెద్దల మోసగించుచున్
"చీకటితప్పు" లొప్పని "ఖుషీ" కయి "పెగ్గులు" "నిబ్బు" లానుచున్
లోకములోన దుర్వ్యసనలోల సమాజము తూలిసోలెడున్.
శా. స్త్రీపుంభేదము లేక యీ "యువత" "స్టోన్" "జీన్" దుస్తులన్ దాల్చుచున్
"క్రాపిం"గంచును కత్తిరించుకొని దీర్ఘంబైన కేశంబులన్
"షాపింగంచును "ఫ్రెండ్సు"తో తిరుగుచున్ "సై" యంచు "డేటింగు"లన్
పాపంబులు సలుపంగ భీతిలక దుర్వారంబుగా వర్తిలున్.
ఉ. ఒద్దిక చీరగట్టుకుని ఉత్తమపత్నిగ తెల్గుకోడలా !
దిద్దిక పుత్రపౌత్రులను దీప్తముజేయుచు తెల్గు సంస్కృతిన్
వద్దిక "ఫ్యాంటు షర్టు" లవి "ఫ్యాషను" కైనను దాల్పబోకుమా !
ముద్దిక నోము పండుగల ముచ్చటలారగ నాచరింపగన్.
మ. తరలెన్ "యౌవత" మజ్ఞతాగరిమతో దర్పించి వ్యామోహియై
హరివిల్ రంగు విదేశసంస్కృతిని వెంటాడన్ మహోత్కృష్ట మా
దరణీయంపు స్వదేశ సంస్కృతుల ప్రాధాన్యంబు గుర్తింపకన్;
తరుణం బియ్యది మాతృభాష నిల సమ్మానింపగా సోదరీ !
సీ. రెండు దెందంబుల నొండుగాజేసెడు
మోహపుబంధంబు మూడు ముళ్ళు,
జీవితాంతంబును జేదోడు వాదోడు
పావనబంధంబు "పరిణయంబు",
కష్టసుఖంబుల కావడిమోసెడు
నియమబంధంబు "పాణిగ్రహణంబు",
సంసార రథచక్ర సమవర్తులనుజేయు
నుత్కృష్ట బంధ మీ "ఉపయమంబు",
"మనువు" జీవితపాథేయ" మనగ మనిచి,
పసిడి యక్కరంబుల మన:ఫలకములను
జీవితగ్రంథలిఖితమౌ చిరతరంబు,
నాటి సంప్రదాయముల కాణాచి "పెండ్లి."
డా. యస్వీ. రాఘవేంద్రరావు.
"భారతీయసంస్కృతి ప్రభ" అనే విషయంపై ది.౨౯.౦౪.౨౦౧౨ తేదీని ఆంధ్రపద్యకవితాసదస్సు తూర్పు గోదావరిజిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహింపబడిన పద్యకవిసమ్మేళనానికి అధ్యక్షత వహించి గానం చేయబడినవి.)
No comments:
Post a Comment