audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Thursday, 28 June 2012

వ్యగ్రమానసరోగి యీ ఉగ్రవాది


                  (ఉగ్రవాదం)
సీ||  ప్రాణముల్ దీయుటే పరమార్థమని యెంచు
           కఱకు కసాయివి కావె నీవు ?
     తల్లిదండ్రుల, భవద్బంధుజనుల వీడి
           కానల నొంటరి కావె నీవు ?
     మీ "ముఠా" నేతల "మిథ్యల్", జిహాద్" నమ్ము
           కఠినరాక్షసుడవు కావె నీవు ?
     మోమానకుండగ ముసుగును దాల్చెడు
           కాతరాత్ముండవు కావె నీవు ?

ఆ||వె|| నీతిబాహ్యకార్యనిర్వహణాధుర్య !
       చెనటి ! "ఎత్తువారి చేతిబిడ్డ !"
       "కరుణ" కలదె నీ నిఘంటువు నందున
       రక్తతర్పణంబె రక్తి నీకు.

సీ||    "బాం"బమరిచి, పేల్చి వహ్ని రగుల్తువు
            మారణహోమ సంరంరంభవేళ
       వేడిరక్తంబు హవిస్సుగా వేల్తువు
            మారణహోమసంరంభవేళ,
       ఎముకముక్కల నీవు సమిధల జేయుదు
            మారణహోమసంరంభవేళ,
       హవ్యముగావేల్తు వా మాంసఖండముల్
            మారణహోమసంరంభవేళ,

తే||గీ||  "హాహకారము"లగును "స్వాహాస్వనములు",
       "వేదమంత్రధ్వను" లగు "దద్రోదనములు",
       ఇట్టి "నరమేధ"మందు నీ కేది "ఫలము" ?
       అసువు "లాత్మాహుతి"కి "పణ" మగుట తప్ప.

సీ||    ప్రజల భయావహుల నొనర్చుటయె గురి
            నాటు బాంబులతోడ చేటు గూర్చు,
       రక్తపుటేరులు ప్రవహించుటే గురి
            మానవబాంబుగా మారనేర్చు,
       మారణాయుధపు సంపాదనపై గురి,
            మాదకద్రవ్యంపు మత్తుగూర్చు
       నేతల విడిపించు నిర్ణయంబే గురి
            అధికార నేతల నపహరించు,

తే||గీ||  హింసకు ప్రతిరూపంబు "విధ్వంసవాది",
       "వ్యగ్రమానసరోగి యీ యుగ్రవాది",
       రక్తపురుచి మరగిన వ్యాఘ్రముల నుగ్ర
       వాదుల నెదురు రక్షణపాటవాల
       సకలదేశంబు లొక్కటై సాగినపుడె
       యందరేకమైనప్పుడే యణచగలము.
డా.యస్వీ రాఘవేంద్ర రావు 
(ది.౦౩.౦౬.౨౦౧౨ తేదీని కడియంలో నిర్వహింపబడిన ప్రతినెలా పద్యం
కార్యక్రమానికి అధ్యక్షత వహించినపుడు "ఉగ్రవాదం" అనే అంశంపై
గానం చేసినవి.)

No comments:

Post a Comment