audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday, 17 August 2011

"మహాదాత"

 శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరు


                 1969 లో స్వర్ణోత్సవ సంవత్సరం లో ఎమ్.ఎస్.యెన్.సి ఎలెమెంటరీ స్కూల్ అధ్యాపక బృందం.


     "మహాదాత" శ్రీ సత్యలింగంనాయకరుగారి ప్రశస్తి

చదువు వలన మానిసికి సంస్కార మబ్బు
చదువకయె నీ కనుపమ సంస్కార మబ్బె
పూర్వపుణ్యంబు కతన, నపూర్వ పుణ్య
చరిత ! నిరతాన్నదాత ! శిక్షాప్రదాత !
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

"కోటికి పడగలెత్తిరి కోట్లకొలది"
నీసరి యశోధనులు లేరు నిక్కముగను
కలిమిబలిమిన్ నరుడు యశఃకాయు డగునె ?
ఇలను దానధర్మంబుల వలనగాక !
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

మూడడుగులే యొసగె బలిభూవిభుండు,
మాంసలేశము నిడె శిబి మనుజపతియు,
అస్థిశకలమిచ్చె దధీచి, యట్లుగాక
సకలమిచ్చి తీ వొకడవె జగతిలోన
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

ధర్మరథ మనియెడు నీదు ధర్మసంస్థ
ధర్మకర్తలను ఘనబోధకుల కతన
సాగుచున్నది వేఱొండు సాటిలేక
శాంతి బొందగ నీయాత్మ శాశ్వతముగ
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

గాన, నాట్య, కవిత్వాది కళలయందు
రాజకీయార్థిక ప్రజారంగములను,
వైద్య సాంకేతికాదిక విద్యలందు
ఘనతకెక్కిన పుత్రుల కన్నతల్లి !
రమ్యగుణవల్లి ! పాఠశాలామతల్లి !

దివిజ మనుజవరులు మెచ్చు దేశభక్తి
శమదమ కరుణ సత్యాది సద్గుణముల
తీర్చి దిద్దితివి సుతుల దివ్యమాత !
అందుకోవమ్మ మా హృదయాంజలులను
రమ్యగుణవల్లి పాఠశాలామతల్లి !

విధప్రాంతముల వసించి వివిధగతుల
నిఖిలజగతి కీర్తిని చాటు నీదుసుతుల
కాయురారోగ్యభాగ్యము లందజేసి
చిరము మనజేయుమమ ! శుభాశీస్సు లొసగి
రమ్యగుణవల్లి ! పాఠశాలామతల్లి !

రంగురంగు తోరణముల్ కళకళలాడ,
రమ్య విద్యుత్ప్రభలును తళతళలాడ,
బాలికల నృత్యగానముల్ లీల మ్రోగ,
ప్రేక్షకుల కమితమగు నపేక్షగొలుప
నుల్లసంబుగ జరిగె స్వర్ణోత్సవంబు.

పౌరులెల్లరు నీకు గౌరవమునుజూప,
      పూర్వవిద్యార్థులు పూని నిలువ,
సురవరు లనిశంబు శుభశాంతులను గోర
       ఒజ్జలందఱు నీదు పజ్జనుండ,
తల్లిదండ్రులు నీదు ధన్యత కీర్తింప,
       బాలబాలికలు జేజేలు పలుక,
సాహిత్యవేత్తలు సంతతము పొగడ
       సత్యలింగార్యుడు స్వస్తి పలుక,
అప్పరావార్యుడును నీదు గొప్పచాట
అల్ల వెంకతనారాయణాదృతిగని
సత్యనారాయణుడు నిన్ను సన్నుతింప
ఉజ్జ్వలంబుగ జరుగు వజ్రోత్సవంబు,
డా .యస్వీ  రాఘవేంద్ర రావు 
.(శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరు చారిటీసు ప్రాథమిక పాఠశాల, జగన్నాధపురం,కాకినాడ స్వర్ణోత్సవ (౧౯౧౯-౧౯౬౯) ప్రత్యేక సంచికలో ౧౯౬౯లో ప్రచురితము.)

    " మహాదాత " శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరుగారి మీద
                  "మంగళహారతి"
       ( రచన: మా మేనత్తగారు శ్రీమతి పెమ్మాడి అన్నపూర్ణమ్మగారు)

పల్లవి: సత్యలింగ నాయకరునకు  సఖియ హారతు లివ్వరే !
        పసిడి పళ్ళెరముల బూని  బాలిక లందఱును                   /సత్య/
చ: ౧.  పేదలకు పెన్నిధియు  పెరటి కల్పవృక్షము       
        అధిక ధనము నొసగి దివికి  ఆయన వేంచేసెను                 /సత్య/
చ.౨. వాసిగా చొల్లంగి తీర్థవాసులు తరియింపగా
       గుడులు గోపురములు కట్టి ముక్తి మార్గము చూపిన
   ౩.  పల్లవకులమందు పుట్టి పరమధార్మికుడాయెనే
       బాలలారా భక్తితోడ ప్రస్తుతించి మ్రొక్కరే                   /సత్య/
   ౪.  అధికదానపరుడు తాత ఆత్మశాంతి కొఱకునై
         దీక్షతోడ తర్పణంబులు విడుచుచుండె మనుమడు              /సత్య/
   ౫.   చిన్నసత్యలింగమునకు సిరులు హెచ్చునట్లుగా
         దైవప్రార్థన చేయుడందఱు ధన్యవాదము లొసగుచు              /సత్య/
    ౬.   కోరంగిపుర నివాసిని అన్నపూర్ణ తోడను
          అతివలారా ! తాత కొసగరె వందనశతంబులు                    /సత్య/


( ఈ మంగళహారతిని శ్రీ మల్లడి సత్య్లింగంనయకరుగారి వర్ధంతికి ప్రాథమికపాఠశాల బాలికలచే పాడించుచుందురు. ఇప్పటికిని ఈ ఆచారముకొనసాగుతూనే ఉన్నది) 
 రచయిత్రి
శ్రీమతి పెమ్మాడి అన్నపూర్ణమ్మ

No comments:

Post a Comment