audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Friday, 1 July 2011

"ప్రజాకవి" జాషువా

అయిదు తలల నాగేంద్రున కడలిపోయి,
దాని బుసలకు వసివాడు ధరణి గావ
"గబ్బిలము" రచియిచితి వబ్బురముగ
ప్రజల నాల్కల తిరముగ బ్రతుకు "సుకవి !"
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

"సాహితీ సమరాంగణ సార్వ భౌముడు" శ్రీకృష్ణ దేవరాయలు

ప్రాకట సాహితీ సమరరంగ విరాజిత సార్వభౌమ ! నీ
దే కద ! ధాత్రి స్వర్ణయుగ దిగ్జయపాలన శౌర్యబంధురా !
యీ కవి దిగ్గజాలనిటు లేలుచు దానజలైకధారలన్
మేకొన కీర్తిచంద్రికలు మేదిని గ్రాలుము కృష్ణభూవరా !

రాయల సాటి యెవ్వరిల రాజిత సంగర సాహితీమహో
పాయములందు; పల్కు లవి పాయని యస్త్రములై జయం బిడున్
తీయని కంఠ మెత్తగనె తేనెల సోనలు జాలువారెడున్
హా ! యని ఖడ్గముల్ కలము లంతట వీడి జయంబు పల్కరే ?
జే యని వీరులున్ కవులు; చేకురు మీకు శుభంబు భూవరా !

సాహితీ సమరాంగణ సార్వభౌమ !
అత్త కోడండ్రు నీ యింట పొత్తుతోడ
చిరము కాపురంబుండి యచ్చెరువు గొలుప
విభవ కవితా ఘనస్ఫూర్తి వేడ్క నింప
దిగ్గజారూఢ నీ కీర్తి దివ్య హంసి
విహరణము సేయుగాక ! దిగ్వీధులందు
భువన విజయాభిరామ ! సంపూర్ణ మూర్తి !
అష్ట  కవికల్పభూజ ! ఓ ఆంధ్ర భోజ !
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

"అవధానాంబర రాజహంస" డా. గరికిపాటి

"అవధానాంబర రాజహంస !"ఘన విన్యాస ప్రశంసా ! మహా
కవి విద్వత్సరసజ్ఞ పారిషద హృత్కన్యారిరంసా ! మహా
ర్ణవ ఘోషంబుల మించె నే డిట జయారావంబు లాశాంతముల్
అవధానేష్టి ఫలంబు నొందితి సహస్రాస్యా ! నృసింహాహ్వయా !


కవనంబా యిది యుల్లసన్మధుఝరీ కమ్ర ప్రవాహం బటే !
జవనంబా యిది యశ్వచాలన మహాఛందః ప్రసారం బటే !
అవధానంబొ యపూర్వధారణకు భవ్యారంభమే, సాహితీ
సవనంబే యిది పద్యభారతికి శశ్వత్కీర్తి సంధానమే.
{"సహస్ర భారతి" "మహాసహస్రావధాని" డా.గరికిపాటి నరసింహారావు
నిర్వహించిన సాగరతీర మహా సహస్రావధానం సందర్భంగా ది.౫.౬.౧౯౯౬
తేదీని గానం చేసినవి.}
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
 

నరసింహకవీ ! కవితా ఘనచ్ఛవీ !

శతయోధుల్ తమ ధీకుఠార సమ శాస్త్ర ప్రశ్న వేధింప సం
చిత ధైర్యంబున పాండితీ ప్రతిభతో ఛేదించి తీ వన్నిటన్
స్మిత శస్త్రంబుల, భావ భల్లముల, నిశ్చింతా తనుత్రాణ సం
తతులన్ చేకొని జేతవైతి విట యుద్ధంబందు సత్కీర్తితోన్.


ఒక్కతె తల్లిగా గలిగి యుండుట లోక విశేషమౌనె ? నీ
కొక్కతె గాదు తల్లులుగ నుండిరి యిద్దరు, మాతృమూర్తియౌ
నొక్కతె, శారదా జనని యొక్కతె, యిద్దరి ముద్దు బిడ్డవై
చిక్కని కీర్తినందు "నరసింహకవీ !" కవితా ఘనచ్ఛవీ !
(౧౯౯౪ అక్టోబరు ౯,౧౦ తేదీలలో డా. గరికిపాటి నరసింహారావు
కాకినాడలో గావించిన ప్రప్రథమ శతావధాన సందర్భమున
గానము చేసినవి.)
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

సాహితీలత


నాడు తెనుంగు నేల నరనాథులు రాయల బోలువారు కా
పాడిరి "సాహితీలత" నపారకృపాపరిపాకసేచనన్
నేడది వర్ధిలున్ కరము నిత్యవదాన్యవసంతు లండగా
మూడు సుమంబు లారుఫలముల్ గన శారద కాత్మతృప్తిగన్.

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .


పద్య కవిత


 వివిధ వృత్తంపు వేర్వేరు మడులయందు
         గణసముహపు బీజగణములుంచి,
నవరసవృష్టి ననారతంబును సాకి
         భావంపు టెరువుల బలము గూర్చి,
మృదుపదసస్యంబు లదనుమై పెంచుచు
        కవనసేద్యము సేసి కవికృషికుడు
కావ్యంపు పంటలు ఘనముగా పండించి
        సహృదయ పరితుష్టి సంతరించి,
అఖిలశ్రోతృ పఠితృ హృదయాబ్జ తతిని
భాను పగిదిని నలరించు "పద్య కవిత,
చదువు కొలదిని సుధలిచ్చు సరస కవిత,
హృద్య మనవద్య మైన దీ పద్య కవిత. 

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .                   
                  

పద్యము

 

పద్యము  వారసత్వమగు భాగ్య, మనంత వసంతకాల సం
పాద్య, మమేయమౌ నమృత భాండము, దివ్యము, శారదాంబ నై
వేద్యము, శ్రావ్యమున్, హృదయవేద్యము, హృద్య, మనన్యలభ్య, మా
రాధ్యము, భోగ్య మాంధ్రులకు, రక్షణయోగ్య, మఖండ యోగమున్. 

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .