"పున్నమ చందమామ సరిపోలెడు ముద్దుల మోమువాడ ! నా
కన్నయ ! మిన్నయై మిగుల ఖ్యాతిని గూర్తు వటంచు నెన్న, నా
కన్నను మున్నె నీకిలను కాలము చెల్లిన" దంచు నేడ్చు నా
ఖిన్న ముఖాంబుజన్ గనవె ? ఖేదమె మోదమ మిత్తిదయ్యమా !
ముద్దులుగారు బాలకుని మొహనమూర్తిని గాంచుచున్ సదా
నిద్దపు జెక్కుటద్దముల నీడలు చూచుచు మోదమందుచున్
ప్రొద్దుపుచ్చు నా "యమకు" పుత్ర వియోగము గూర్చి నిర్దయన్
హద్దులు లేని శోకవిపులాంబుధి ముంచితి మిత్తిదయ్యమా !
ఒక్కడె పుత్రుడంచు నత డొక్కడె మా కుల ముధ్దరించు, వే
ఱొక్కడు సాటి లేడనగ నున్నతమౌ పద మందు నంచు వా
రక్కఱ తోడ పెంచి మది నాశలు పెంచుకొనంగ నక్కటా !
యక్కటికంబు లేక యిటు లంతము చేయుదె ? మిత్తిదయ్యమా !
"మీ నాన్నారు గతింపగా కుమిలి యీ మేనింక చాలింపగా
నే నెంచన్ భవదీయ బంధ మది నన్నీరీతి నిల్పెన్, సుతా !
నే నేరీతి వసింతు నింక " నని కన్నీరట్లు మున్నీరు కా
గా నిట్టూర్పుల నేడ్చు తల్లి యదిగో కన్పింపదే మిత్తిరో !
"ఇంతకు ముందె యాడుకొన నేగుదు నమ్మ! యటంచు పల్కి, నీ
బంతియు బ్యాటు పట్టుకొని పాలను త్రాగితి కాదె నాయనా!
ఇంతట కాలసర్ప మది యేవిధి నిన్నిటు కాటు వేసె" నం
చెంతయు శోకతప్త యగు నింతిని గాంచితె ? మిత్తిదయ్యమా !
"వెళ్ళితివయ్య స్నేహితుని పెళ్ళికి, వెళ్ళినవాడ వక్కటా !
వెళ్ళినయట్లు రాక యట వెల్లువ నీట మునింగి నాకు క
న్నీళ్ళు మిగిల్చితయ్య ! నది నీటను గండము తోడ నీకు నూ
రేళ్ళును నిండెనా ? " యనుచు నేడ్చెడు తల్లిని గంటె ? మిత్తిరో !
"మల్లియ వంటి నీ మృదుల మానస వీణను మీటు భాగ్యమున్
పల్లియవంటి నీ పలుకుబాసలు విందులు గూర్చు భాగ్యమున్
వెల్లువవంటి నీ వయసు వేగము మక్కువ గొల్పు భాగ్యమున్
చెల్లయిపోయె " నంచు కడు చింతిలు ప్రేమికు గంటె మిత్తిరో !
"అంబుజనేత్ర ! యేగతి భవాంబుధి నీదగ జాలుదున్, వియో
గాంబుధి ముంచిపోతివి గదయ్య సుఖస్మృతులన్ మిగిల్చి రా
గాంబుధి నోలలార్చితివి హాయిగ నొక్క వసంత మౌర ! శో
కాంబుధి ముంచి" తం చడలు కామిని గాంచితె మిత్తిదయ్యమా !
చేతికి నందివచ్చు సుతు జీతముతోడ ఋణంబు తీఱగా
కూతు నొకయ్య చేత నిడి కోర్కెలు దీఱగ కృష్ణ ! రామ ! యం
చాతత భక్తి తోడ కడు హాయిని ప్రొద్దులు పుచ్చనెంచునే !
ఆతని ఆశలన్ని యడియాసల జేసితి మిత్తిదయ్యమా !
కోడలి కడ్పు పండమికి కుందుచు వంశము నిల్ప వేల్పులన్
వేడుచు నిష్ఠ నోములను పెక్కులు నోచగ జేసి నిచ్చలున్
కోడలి పుత్రునిన్ బనిచె కోరిక యాత్రలు చేయ, "మిత్తిరో !
కీడు ఘటించి మ్రింగి " తని ఖేదము నొందెడు "నామె" గంటివే !
( కీ.శే. యస్.టి.వి. దీక్షితులు (చిన్న) ౨౯వ జయంత్యుత్సవమును పురస్కరిం
చుకొని ది.౨.౫.౧౯౯౪ తేదీని "యలమంచిలిలో ఆంధ్ర పద్య కవితాసదస్సు
ప్రధాన కార్యదర్శి, శ్రీ శిష్ట్లా వెంకట్రావుగారి స్వగృహ ప్రాంగణంలో నిర్వహింపబడిన
సభలో గానం చేయబడినవి.)
డా .యస్వీ రాఘవేంద్ర రావు .