audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Saturday, 2 July 2011

స్వర్ణ భారతి

పరదాస్యమున మ్రగ్గి మ్రగ్గి త్రిశతాబ్దంబుల్ విశాలావనీ
కరుణావేశ మహార్త "భారతి" మహోగ్ర క్రోధయై పిల్వగన్
చరణాగ్రంబుల మోకరిల్లి తనుజుల్ సంకెళ్ళు త్రెళ్ళింపరే
యరుదైనట్టి సమీకమున్ సలిపి సత్యాహింస నాద్యాయుధుల్.

ప్రగతి పథమందు నడిపింప ప్రాజ్ఞవరులు
చేరి స్వాతంత్ర్య రథమున సారధులయి
వర్ణమత సామరస్యమ్ము పరిఢవింప
భరత రాజ్యాంగ నిర్మాణ గరిమ గనిరి.

దేశమునకు వెన్నెముకలై తేజరిల్లు
గ్రామసీమల యందె భరతము గలదు
పంచవర్ష ప్రణాళికా ప్రథమవేళ
వ్యావసాయికరంగాభివర్ధనమ్ము
లక్షితంబయ్యె శ్రీరామ రక్ష గాగ.

నాగార్జున సాగరమా
సాగుకు తెచ్చెను పొలాల సస్యము లడరన్
నాగలి సాగెను రైతుకు,
మ్రోగెను జీవన విపంచి మోహన గీతుల్.

"పారిశ్రామికవృధ్ది గాంచినపుడే ప్రాప్తించు నుద్యోగముల్
ధారాళంబుగ దేశమందు" నని, నేతల్ దేశముల్ తోడ్పడన్.
ఆరంభించిరి నేర్పుమై నినుప కర్మాగార నిర్మాణముల్
తోరంబయ్యె నుపాధి కల్పనము చేతోమోద మేపారగన్.

దూరదర్శనంబు దూరశ్రవణమును
సులభమయ్యె భరత సుతులకెల్ల
"ఆర్యభట్టు" మెఱసె నంతరిక్షంబున
చమురు నాగలోక చరిత దెలిపె.

"విశ్వకవి" రవీంద్రు విదిత గీతాంజలి.
      "జాతిపిత" నితాంత సత్య నిరతి,
"జగదీశచంద్రు" వృక్ష పరిశోధన కృషి.
      "సీ.వి. రామను" శాస్త్ర జీవనమ్ము,
"నేతాజి" "జైహిందు" నినద మహార్భటి,
      తనరు "రాధాకృష్ణు" తత్త్వబోధ,
"జైజవాన్! జైకిసాన్!" "శాస్త్రి" నినాదంబు,
      "రామానుజన్" గణితామరతయు
భూషణమ్ములు గాగ నీ పొలుపు మీరె
ఖండ ఖండాంతరాల విఖ్యాతు లడరె,
"అర్ధశత" వసంతాల సోయగము నీది
"స్వర్ణ భారతీ!" వర్ధిల్లు భావి జగతి.

మన మనుభవించు "స్వాతంత్ర్య ఘనఫలమ్ము"
అమరులౌ దేశభక్తుల త్యాగఫలము
దని రక్షణ బాధ్యతన్ బూనవయ్య !
సోదరా ! భావిభారత జ్యోతి వీవు.

"శాంతి ! శాంతి !" యం చణుపరీక్షల నొనర్త్రు,
"భాయి ! భా" యంచు చెరుతురు పంచశీల,
జిహ్వపై మధువు, విషము చిత్తమున; ప్ర
పంచతంత్రము చిత్ర స్వభావ భరము.

నాడు "స్వప్న విహంగ"మై నడచినావు,
నేడు "స్వేచ్ఛాతరంగ"మై నెగడినావు,
"స్వర్ణభారత రథ మిదె సాగి వచ్చె,
ప్రగతి పథమందు నడిపించు "భావి జగతి."
{ది. ౧౪.౮.౧౯౯౭ తేదీని "ఆంధ్ర కేసరి యువజన సమిత్" నిర్వహించిన
 కవిసమ్మేళనం లోను, ది.౧౫.౮.౧౯౯౭ తేదీని పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం
 నిర్వహించిన కవి సమ్మేళనం లోను గానం చేసినవి.}
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

No comments:

Post a Comment