audio
http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti
Monday, 30 April 2012
Sunday, 29 April 2012
భక్తిగీతాలు 3
రచన : డా|| యస్వీ. రాఘవేంద్రరావు
("ప్రేమలేఖలు" చిత్రంలోని "రారాదా" అను పాట వరుస)
పల్లవి|| శ్రీదేవీ ! మది నిన్నే తలతు జననీ !
నను బ్రోవ వేగరావా ! నీ సేవ చేతునమ్మా ! ||శ్రీదేవీ||
చ|| ౧. పాదదాసునికిది - శాపమా !
తొల్లి నేజేసినట్టి - పాపమా !
వేగ కాపాడ నీకే - భారమా !
నన్ను వేధింప నీకు - న్యాయమా ! ||శ్రీదేవీ||
చ|| ౨. అల వైకుంఠమున - వెలసీ
ఎల్ల భువనాలనేలే - వేలుపా !
మాబోటి వారి - బాధలా
మటుమాయమ్ముజేయ - జాగేల ? ||శ్రీదేవీ||
Saturday, 28 April 2012
Friday, 27 April 2012
" మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు"
నవమాసంబులు మోసి, యోర్చుకొని నానావేదనల్, గాంచి యా
నవజాతార్భకు, వేదనల్ మఱచి, యానందాతిరేకంబునన్
ఇవతాళింపును బొందు, భాగ్యమయ మాతృత్వంబు గల్గించె నా
భువనాధీశు డటంచు బెంచు బుడుతన్ బున్నెంపుబ్రోవంచు తాన్.
వాసిగ కార్య, యోచనల, ప్రాశన, నోర్మి, సురూప, శయ్యలన్;
దాసిగ, మంత్రిగా, నమగ, ధాత్రిగ, లక్ష్మిగ, రంభగా సదా
భాసిలి కూర్చు నాథునకు, స్వర్గముగా నొనరించు గేహమున్,
బాసటయౌచు నిల్చు ముదివగ్గునకున్ ధర ధర్మపత్నియై.
అల ప్రేమామృతవర్షిణీ "గృహిణి"యై, "యర్ధాంగి" యై, "భార్య"యై,
యలరంజేసెడు "పత్ని"యై, మనుచు "నిల్లాలై" , కుటుంబంబు వ
ర్ధిలజేయున్ "సహధర్మచారిణి" ,"పురంధ్రీ", "జాయ"యై, దారయై,
ఇలలో "పాణిగృహీతి"యై వరలి సేవించున్ పతిన్ నిచ్చలున్.
"అన్నా ! తమ్ముడ ! యంచు ముద్దొలుక నోరారంగ బిల్చున్ సదా,
వెన్నంటే తిరుగు "న్నిది, మ్మదియు నీవే ?"యంచు గోరున్ పదే,
"అన్నా ! తమ్ముడ ! యాడుకొంద మిట బువ్వా"టంచు తా వండదే ?
"చిన్నారిం గయికొండు కోడలిగ నిశ్చింతౌను మీ చెల్లికిన్."
ఇటుల కలకల నగుచు నట్టింట దిరిగి,
పుట్టినింటను హక్కులు పట్టుబట్టి
యనుభవింపగా నాశించు నాడుపడుచు
కరుణ తోబుట్టువులపాలి కల్పవల్లి.
మమతానురాగాల మానవతామూర్తి
ధన్యాత్మురాలైన తల్లి, మహిళ:
మగని ప్రఖ్యాతిలో సగపాలు పోషించు
ఆనందవల్లి యిల్లాలు, మహిళ;
ఆత్మీయతాభావ మభిమాన దీప్తిమై
చెలికార మొలికించు చెల్లి, మహిళ;
కారుణ్య సహనాది గణనీయసుగుణాల
పాలవెల్లిని కల్పవల్లి, మహిళ;
తల్లి, యిల్లాలు, చెల్లెలై యుల్లసిల్లు
వనిత పూరుషాహంకార బలిపశువుగ
నయ్యె, నయ్యయ్యొ ! వేధింపు లగ్గలముగ;
"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు"
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
(ది.౨౫.౦౩.౨౦౧౨ వ తేదీని ఆంధ్ర పద్యకవితాసదస్సు తూ|| గో|| జిల్లా శాఖచే రాజమండ్రిలో "మహిళ"పై నిర్వహింపబడిన కవిసమ్మేళనమునకు అధ్యక్షత వహించిన సందర్భమున గానము చేయబడినవి.)
Tuesday, 24 April 2012
Monday, 23 April 2012
Sunday, 22 April 2012
వృక్షో రక్షతి రక్షితః
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భముగా
తరువేదన
"చల్లని నీడ నిచ్చి కడు చల్లని గాలుల సేద దేర్చుచున్తల్లి వలెన్ ఫలంబు లిడి తాపము నాకలి తీర్చుచున్
పెల్లగు తాల్మి తోడ మది భేద మదేమియు లేక సాకుచున్
నెల్లరి యుల్లముల్ తనుపు నిట్టి మమున్ వధియింప న్యాయమే !"
"మానుల పెంచి యాకసము మక్కువ ముద్దులు వెట్టనెంచు మా
మేనులు గొడ్డటన్ నఱికి మిక్కిలి చేతులు కోసి కోసి నె
మ్మేనులు చీల్చి ఱంపముల, మేకులు కొట్టియు, పట్టి చిత్రికల్
మానవ ! తోమి తోమి దయమాలి వధింతురు దారుణంబుగన్."
"బిడ్డల వోలె సాకి కడు ప్రేమను పెంచిన గొడ్డు గోదలన్
దుడ్డున కొక్క వ్రేట తల ద్రుంచు కసాయికి నమ్మునట్లుగా
బిడ్డల వోలె సాకి మము పెంచి బలిష్ఠముగాగ సొమ్ముకై
గొడ్డలి పాలు చేయుదురు క్రూర గతిన్ మమతా విహీనతన్."
"మేనులు బాసి పెంచుదుము మీ గృహసీమల వన్నె వాసి, మీ
మేనులు మోసి పంచుదుము మీకు మహా సుఖభోగరాశి, మీ
మేనులు మూసి మానమును మెండుగ గూర్చెడు నంబరంబులన్
లోన భరించు మమ్ముల కనుంగొన రెంత కృతఘ్నభావమో !"
"చల్లని నేలతల్లి యొడి చక్కగ చేరిన నాటి నుండియున్
మెల్లగ రోజు రోజునకు మేనులు పెంచుచు కేలు చాచుచున్
చల్లని పిల్లగాలిచెలి చక్కిలిగింతల డోల లూగు మ
మ్మల్లరి పెట్టగాదగునె ? యాకులు, కొమ్మలు దూసి కోసియున్."
"దినదిన గండమై బ్రతుకు దీనుల పాలిట జాలి చూపకన్
చెనకుట క్రీడ కొందరి కిసీ ! పలు దోమగ కొమ్మలన్ పుటు
క్కున విఱుపంగ క్రీడ మఱి కొందరికిన్; పసులే నయంబు క్షు
త్తను ననలంబు బాపుకొన నాకులె మేయును హాని చేయకన్."
"సంతతి పెంపు సేయు ఋతుచక్ర సమాగత హర్షవేళలన్
హంతకులట్లు పిండముల నంతము సేసి తదీయ సారమున్
ముంతల బొట్టు బొట్టులుగ మొత్తము పట్టుచు మత్తుమీర సే
వింతురు వ్యగ్రచిత్తులయి వీరవిహార వినోదకాములై."
"కుత్తుక కత్తితో సగము కోయుచు, కోయుచు లొట్టిగట్టి మా
నెత్తురు చుక్క చుక్కలుగ నిచ్చలు పిండుకు త్రావుచున్ కడున్
మత్తిలి దారపుత్రులను మాపులు రేపులు బాధ పెట్టుటన్
ఉత్తమ చిత్తహింస ద్విగుణోధ్దుర మౌచు ధరన్ కలంపదే ?"
"మందులు, మాకులున్, ఫలసుమంబులు, పత్రసమూలకాండముల్
డెందము సంతసింప నిబిడీకృతశక్తులు ధారవోసి మీ
కందుల,వృధ్ధులన్, మరణకామిని కౌగిట చిక్కు రోగులన్
పొందగ నాయురున్నతులు ప్రోతుము; మమ్ముల నొంచుటొప్పునే ?"
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
Saturday, 21 April 2012
భక్తిగీతాలు 2
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు
రాగం: భీంప్లాసు తాళం: ఖండగతి
(చాయ : మాతెనుగుతల్లికి)
పల్లవి|| శ్రీలక్ష్మిదేవికి - శ్రీకల్పవల్లికి
మాయింటి వేల్పుకు - మావందనములు ||శ్రీలక్ష్మి||
అ||ప || పాలసంద్రమునందు - ప్రభవించి ఓతల్లి !
వైకుంఠవాసుని - ఇల్లాలివైనట్టి ||శ్రీలక్ష్మి||
చ||౧. స్థిరతయే ఎరుగని - శ్రీదేవి ఓజనని !
మాయింట స్థిరముగా - మనుచు మమ్మేలుచు
నిత్యమూ నీచింత - నిలచియుండేటట్లు
కరుణించి మమ్మేలు - కమలాయతాక్షి ! ||శ్రీలక్ష్మి||
చ||౨. ఈప్సితార్థములివ్వ - నీకన్న మిన్నెవరు ?
అని నొక్కిపల్కుచు - అనురక్తితో నేను
నీ పూజలే చేసెదా - నీ పాటలే పాడెదా
జై లక్ష్మిదేవి ! - జై లక్ష్మిదేవి ! ||శ్రీలక్ష్మి||
Friday, 20 April 2012
Wednesday, 18 April 2012
Tuesday, 17 April 2012
డా.రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భముగా
వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా
హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే
నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.
విశదమైనది నీదు విజ్ఞానధీశక్తి
యిలలో నుపాధ్యాయవృత్తి కతన
ప్రకటితంబయ్యె నీప్రతిభ మాస్కోనగ
రమున దౌత్యంబు నెఱపిననాడు
ఉపరాష్ట్రపతిగ, పిదప రాష్ట్రపతిగాగ
రాణించినది నీదు రాజనీతి,
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
కమనీయ కైవల్య కావ్యకన్య
"భారతీయ తత్త్వము" నీదు భాగ్యదుహిత,
ఆంధ్రకాశికా విశ్వవిద్యాలయముల
తగ నుపాధ్యక్షుడ వయిన ధన్యజీవి !
అందుకోవయ్య ! మా హృదయాంజలులను.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .Monday, 16 April 2012
దేశభక్త్యంతరంగ ! వీరేశలింగ !
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు జన్మ దినోత్సవం సందర్భముగా
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్యకర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు, పూజ్యకవి, నా యుగపూరుషు నాత్మ గొల్చెదన్.
పెంపగు నంధ పద్ధతుల పేర్చిన మూఢుల కుక్కు కత్తియై,
ఇంపుగ సాని కొంపల చరించు విటాళికి ప్రక్కబల్లెమై,
పెంపగు లంచగొండ్ల తగ పీచ మడంపగ గుండెగాలమై,
సొంపగు నీదు సంస్కరణ స్తుత్యము కాదె ? వివేకవర్ధనా !
"రాజశేఖరచరిత్ర" రచించినాడవు
మూఢవిశ్వాస నిర్మూలమునకు,
ఆంధ్రీకరించితి వత్యంతమును రస
వంతమ్ముగాగ "శాకుంతలము"ను.
సంతరించితి వతిశ్రమకోర్చి "యాంధ్ర క
వుల చరిత్రమ్ము" నపూర్వ సరణి,
చిరకీర్తియుతము నీ "స్వీయ చరిత్రమ్ము"
తత్కాల సాంఘిక దర్పణమ్ము
బహుళ కావ్యమ్ము లాదిగా పాఠ్య పుస్త
కముల వఱకు శతాధిక గ్రంథవితతి
లలిత సాహితీ ప్రక్రియల వెలయించి
తభినుతంబుగ "గద్య తిక్కన" సమాఖ్య !
భర్త గతాసుడై బ్రతుకు భారముగాగ సమస్త సౌఖ్యసం
హర్త ప్రపంచకర్త " యని యాత్మను క్రుంగి కృశించి నిత్యస
ద్వర్తన ప్రొద్దుపుచ్చెడు వితంతుల వంత దొలంచు సంఘసం
స్కర్తృగణాగ్రగణ్యుడవు గాదె ! "సతీజన లోకబాంధవా !"
అలనా డీ ఘనరాణ్మహేంద్రపురి విద్యాజ్యోతి నీ చేతితో
వెలిగింపంబడి, నే డఖండమగు దీప్తిన్ తేజరిల్లంగ మా
న్యులు, దక్షుల్, కరుణాసముద్రులు, సుధీయుక్తుల్ సమీక్షింపగా
నిల నిష్కంప నివాతమై సతము వర్ధిల్లున్ జగన్మాన్యమై.
"స్త్రీబుద్ధిః ప్రళయాంతకీ" యనుచు, నా స్త్రీబుద్ధికిన్ తోడు వి
ద్యాబంధంబు చెలంగుచో స్థితు లనూహ్యంబంచు వాదించు చిం
తాబద్ధాత్ముల నోర్చి చేసితి విద్యాగంధ విఖ్యాతలన్
పూబోడుల్ నిను విస్మరింపరు సుమీ ! పూజ్యాంధ్రవైతాళికా !
హరిజనులనంగ నా శ్రీ
హరిజనులని గాంధికన్న నతిపూర్వం బీ
ధర చాటి, వారి స్థితి ను
ద్ధరింప సమకట్టి తీవు దళితోద్ధరణా !
మంత్ర తంత్రాచార మహిమ లొప్పకునికి
"శరభసాళ్వ" ఘటన సాక్షి కాదె ?
పూర్వ సువాసినుల్ పుణ్య సువాసిను
లగుట నీ ఘనతకు సాక్షి కాదె ?
పాపితి వతివృద్ధ బాల్యవివాహ దు
రాచారము లలర నాత్మబలము,
ఆంధ్రభూమినె గాక యార్యభూమికి గూడ
వ్యాపించె నీదు కార్యక్రమంబు,
నీవు నిల్పిన "హితకారిణీ సమాజ
ము" "పుర మందిర మ్మెపుడు నీ పురిని నిలిచి
యుండు మణిదీపిక లగుచు నొప్పిదముగ
"దేశభక్త్యంతరంగ వీరేశలింగ !"
"మహిని మానవ సేవయే మాధవునకు
సేవ " యని సర్వమును లక్ష్యసిద్ధి కొఱకు
త్యాగ మొనరించినాడవు ధన్యజీవి !
తావకీనాత్మశాంతి నిత్యంబు గాదె !
మూగవోయిన వీణ తీగలు సవరించి
యనురాగ గీతిక లాలపించె,
పరిమళింపక మున్నె వసివాడు కుసుమంబు
మరల గుబాళించె నరుసమంది,
మోడువారు బ్రతుకు తోడు కల్గుటచేత
చిగురించి పండెను చిరతరంబు,
శూన్యాభ్రఫాలాన సోమాభతిలకంబు
పున్నమి వెన్నెలన్ చెన్ను గొలిపె,
ఎవని కృషి నవని ననద యువిద లెల్ల
ముత్తయిదువ లైరి మిగుల మోద మలర
నట్టి వీరేశలింగాఖ్యు నతివ లెల్ల
నిచ్చలు స్మరించి ఋణ మీగి నెగడ దగును.
డా.యస్వీ రాఘవేంద్ర రావు . Friday, 13 April 2012
"దమనకాండ."
అంబేథ్కర్ జయంతి సందర్భముగా
ప్రకృతి యొసంగు నీరములు పానము సేయగరా దటంచు, హీనకులజు లంచు మిక్కిలి యనాదరణంబును జేసి, యంటరా
ని, కనుల గాంచరాని కడు నీచులటంచు సవర్ణ హిందువుల్
వికృతపు జేష్టలన్ కఱకు వేడుక సల్పిరి సొదరాళిపై.
ఎదురు రాకూడదట ! మరి యెదురుపడిన
చెప్పులను చేగొని యొదిగి తప్పుకొనవ
లెనట ! "కుక్కిన పేనువలె" పడియుండ
వలెనట ! యెదురాడక నయవర్తనముల.
నాల్గు వర్ణము లైదయ్యె నరకమయ్యె,
అంటరాదని పొలిమేర గెంటబడిరి
శ్రమను దోచెడు దుర్గతి సంభవించె
అమలు జరిగెను దరుణ "దమనకాండ."
జంతువులకన్న హీనమౌ జన్మ యనుచు,
జీవితంబు దుర్భరమని చింతవడుచు,
దేవుని దరిసింపగలేని దీనులమని
"గుండె చెఱువు" గా బొగిలిరి కుమిలి కుమిలి.
అట్టి యసభ్యవర్తనము, నట్టి యకృత్యము, నట్టి క్రౌర్యమున్,
అట్టి యమానుషంపుబను, లట్టి కుసంస్కృతి, యట్టి నైచ్యమున్,
అట్టి నికృష్టపుంబ్రథను, నట్టి నిరంకుశమైన ధోరణిన్
ఎట్టు సహించిరో కఠిను లెంతలు సేసిరి నిర్దయాత్ములై.
దళిత వర్గాల పాలిట దైవమనగ
దమననీతి దుఃఖితుల కోదార్పులిడగ
"భరత రాజ్యాంగ నిర్మాత" ప్రథితకీర్తి
సదయు డంబేథ్కరుండు నాదుదయమందె.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
Wednesday, 11 April 2012
కైలాస సభ 8
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 8
(డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే పరమేశ్వర స్తుతి,కవీశ్వరుల పరిచయం )
(డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే పరమేశ్వర స్తుతి,కవీశ్వరుల పరిచయం )
Tuesday, 10 April 2012
Monday, 9 April 2012
కైలాస సభ 7
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 7
(డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే పరమేశ్వర స్తుతి)
(డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే పరమేశ్వర స్తుతి)
Sunday, 8 April 2012
Saturday, 7 April 2012
కైలాస సభ 6
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 6
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం,డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే సభా ప్రారంభం )
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం,డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణ(నందీశ్వరుడు) గారిచే సభా ప్రారంభం )
Thursday, 5 April 2012
Wednesday, 4 April 2012
కైలాస సభ 5
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 5
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం)
Tuesday, 3 April 2012
Monday, 2 April 2012
కైలాస సభ 4
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 4
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం )
Sunday, 1 April 2012
భక్తిగీతాలు 1
శ్రీరామ నవమి శుభాకాంక్షలతో
రాగం : యమునాకళ్యాణి తాళం : దేశాది
పల్లవి|| : భజనసేయ లేవోయి ! - భక్తా !
భజనసేయ రావోయి ! ||భజన||
అ||ప|| : రామభజనమే - మోక్షసాధనం
రామనామమే - పరమపావనం ||భజన||
చ|| ౧. భక్తికి మించిన - శక్తిలేదు ధర
ముక్తికి భక్తియె - మూలకారణం
సంసారజలధిని - దాటు సాధనం
కష్టాలన్నిటికి - కవచధారణం ||భజన||
చ|| ౨. రామపూజలే - భోగభాగ్యములు
రామసేవ - సౌభాగ్యతారకము
రామకీర్తనకు - సాటి కార్యము
వర్తమానమున - వెదకినలేదు ||భజన||
Subscribe to:
Posts (Atom)