నవమాసంబులు మోసి, యోర్చుకొని నానావేదనల్, గాంచి యా
నవజాతార్భకు, వేదనల్ మఱచి, యానందాతిరేకంబునన్
ఇవతాళింపును బొందు, భాగ్యమయ మాతృత్వంబు గల్గించె నా
భువనాధీశు డటంచు బెంచు బుడుతన్ బున్నెంపుబ్రోవంచు తాన్.
వాసిగ కార్య, యోచనల, ప్రాశన, నోర్మి, సురూప, శయ్యలన్;
దాసిగ, మంత్రిగా, నమగ, ధాత్రిగ, లక్ష్మిగ, రంభగా సదా
భాసిలి కూర్చు నాథునకు, స్వర్గముగా నొనరించు గేహమున్,
బాసటయౌచు నిల్చు ముదివగ్గునకున్ ధర ధర్మపత్నియై.
అల ప్రేమామృతవర్షిణీ "గృహిణి"యై, "యర్ధాంగి" యై, "భార్య"యై,
యలరంజేసెడు "పత్ని"యై, మనుచు "నిల్లాలై" , కుటుంబంబు వ
ర్ధిలజేయున్ "సహధర్మచారిణి" ,"పురంధ్రీ", "జాయ"యై, దారయై,
ఇలలో "పాణిగృహీతి"యై వరలి సేవించున్ పతిన్ నిచ్చలున్.
"అన్నా ! తమ్ముడ ! యంచు ముద్దొలుక నోరారంగ బిల్చున్ సదా,
వెన్నంటే తిరుగు "న్నిది, మ్మదియు నీవే ?"యంచు గోరున్ పదే,
"అన్నా ! తమ్ముడ ! యాడుకొంద మిట బువ్వా"టంచు తా వండదే ?
"చిన్నారిం గయికొండు కోడలిగ నిశ్చింతౌను మీ చెల్లికిన్."
ఇటుల కలకల నగుచు నట్టింట దిరిగి,
పుట్టినింటను హక్కులు పట్టుబట్టి
యనుభవింపగా నాశించు నాడుపడుచు
కరుణ తోబుట్టువులపాలి కల్పవల్లి.
మమతానురాగాల మానవతామూర్తి
ధన్యాత్మురాలైన తల్లి, మహిళ:
మగని ప్రఖ్యాతిలో సగపాలు పోషించు
ఆనందవల్లి యిల్లాలు, మహిళ;
ఆత్మీయతాభావ మభిమాన దీప్తిమై
చెలికార మొలికించు చెల్లి, మహిళ;
కారుణ్య సహనాది గణనీయసుగుణాల
పాలవెల్లిని కల్పవల్లి, మహిళ;
తల్లి, యిల్లాలు, చెల్లెలై యుల్లసిల్లు
వనిత పూరుషాహంకార బలిపశువుగ
నయ్యె, నయ్యయ్యొ ! వేధింపు లగ్గలముగ;
"మహిళ సంరక్షణీయ యిమ్మహిని నేడు"
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
(ది.౨౫.౦౩.౨౦౧౨ వ తేదీని ఆంధ్ర పద్యకవితాసదస్సు తూ|| గో|| జిల్లా శాఖచే రాజమండ్రిలో "మహిళ"పై నిర్వహింపబడిన కవిసమ్మేళనమునకు అధ్యక్షత వహించిన సందర్భమున గానము చేయబడినవి.)
No comments:
Post a Comment