మహిషాసుర మర్దని
హరి హర బ్రహ్మ రవి చంద్ర వరుణ శక్రవసు కుబేర భూమి ప్రజాపతి యమాగ్ని
వాయు సంధ్యల తేజాల ప్రభవ మంది
"శక్తి" వైతివి మహిషుని సంహరింప.
రాక్షసులు మహాహన కాల చక్షురులును,
అల బిడాలాసిరోమ బాష్కలురు, నుగ్ర
దర్శనులను సైన్యపతి సప్తకము నీవు
చండకోపాన వధియించి "చండి" వైతి.
పార్వతీ కాయమున నుండి ప్రభవ మంది
యజ్ఞభాగం బపహరించు నసురులైన
యల శుంభ నిశుంభుల యసువులంది
"కౌశికి" యనెడు నామంబు గాంచి తీవు.
శీత నగమందు విహరించు మాత ! నీవు
క్రూరులౌ చండ ముండుల క్రోధదృష్టి
గాంచినంతనే నీ మోము కాలమయ్యె
"కాళిక" యను నామంబు ప్రఖ్యాతమయ్యె.
"హవ్యభాగంబు దేవత లందుకొనగ
నసురులార ! ముజ్జగ మిచ్చి యమరపతికి,
పఱచి పాతాళలోకంబు, బ్రదుకు" డనుచు
దూతగ శివు బనిచి "శివదూతి"వైతి.
తామస కామ సంతమస దర్పిత మూర్తులు మత్తచిత్తులై
ఆ మహిషాసురాది హతకావళి జంపితి దుర్గ ! శక్తివై;
ఈ మహి నంతకంటెను నికృష్టుల స్వైర విహారవర్తులన్
ఏమరి యుంట నీకు దగునే ? దహియింపుము కంటి మంటతోన్.
జగతి తల్లు లిద్దఱు సర్వజనుల కరయ
నెమ్మి జన్మ నొసగి సాకు "నమ్మ" యొకతె
యాపద గడవగ శుభము నభయ మొసగి
యల యదృశ్యగతిని గాంచు "నంబ" యొకతె.
"వింధ్యవాసిని"యు, "శతాక్షి", "భీమ", "దుర్గ",
"రక్తదంతి", "శాకంభరి", "భ్రామరి" యను
పేర్ల నవతరింతు వటంచు వింటి మేముఅట్టివేళ నే డాసన్నమయ్యె నమ్మ !
"దుష్ట శిక్షణంబు" ధరణి "శిష్ట రక్ష
ణంబు నవతార లక్ష్య మనంగ వినమె ?
అంబ ! పరమేశ్వరీ ! యిల నవతరించి
మహి నసురుల మర్దించు మమ్మ దుర్గ !
No comments:
Post a Comment