audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Saturday 17 September 2011

ప్రతీక్ష

ప్రతీక్ష
  తెలుగుతోట నాటిన సాహితీలతలను
పాదుచేసి, జలముపోసి, ప్రోదిచేసి
సరసగతి నేకరీతిని సాకుచున్న
తోటమాలి కేలనొ ? నేటి తొట్రుపాటు.

నిచ్చలు కలకలలాడుచు
నచ్చపుదన్పున తలిర్చు నాతని ముఖమం
దెచ్చిన వేదనగా విన
వచ్చెను హృద్గత విషాద వచనము లెవియో !

వ్యాసవల్లికయును, గేయవల్లరియును,
కతలతీగయు, నాటకలతిక యిటుల
పూతలై పువ్వులౌచు బెంపుగన,
నొక్క కావ్యలత కుసుమించని కత మిదేమి ?

కరగున్ నెమ్మది నేడు మిక్కిలిగ బ్రాక్కాలంబునన్ వెల్గి న
వ్య రసాస్వాదన భృంగముల్ సరస దివ్యానందమున్ గ్రోలగా
నురుకీర్తింగని, దర్శనీయమయి యాంధ్రోద్యాన వాటిన్ సమా
దరమౌ పద్యమధు ప్రసూనముల తత్సాహిత్యవల్లింగనన్.

ప్రోది చేయుటేనెఱుగక ముందునుండి
అయ్య నాతోడ జెప్పిన తియ్యనైన
కావ్య సుమలతా ప్రసవ సంగతులవెల్ల
స్మృతిపథాన దిర్గె చలనచిత్రమట్లు.

"భారత" ప్రసవమ్ము ప్రభవించి యీ
      తోట బంచమవేదమై బరగలేదె ?
"హరివంశ" భాగవతాది లతాంతముల్
       కృష్ణభక్తి మధు వందింపలేదె ?
అల్ల "మనుచరిత్ర" యత్యంత సురభిళ
        కుసుమమై హాయిని గూర్పలేదె ?
"పారిజాత" సుమంబు పరిమళంబులతోడ
         ముద్దులొల్కగ ప్రజల్ మురియలేదె ?
"కళాపూర్ణోదయా"నీతవాసన
         లింపుగా నిల గుబాళింపలేదె ?
"ఆముక్తమాల్యద" హరిభక్తి పారమ్య
         సౌరభ్యములు వెదజల్లలేదె ?
"శృంగారనైషధ" శృంగార కుసుమమ్ము
         ఇంపుతావుల సొంపు నింపలేదె ?
 "సౌందరనంద" మన్ సుందర పుష్పమ్ము
          దివ్యసుగంధ మందింపలేదె ?
"ఆంధ్రపురాణ" నవ్యవికచ సూనమ్ము
           గుమగుమ వాసనల్ కురియలేదె ?
"రాణాప్రతాప్ చరిత్ర" మను ప్రసూనమ్ము
           కమ్మతావులు విరజిమ్మలేదె ?
"శివభారతాఖ్య" ప్రసవరాజ మసమాన
           దేశభక్తిరస మందింపలేదె ?
"బాపుజీ ఆత్మకథా" పంకజాతమ్ము
              హృదయ విపంచి మ్రోగింపలేదె ?
అట్లు "ప్రాచీన" "నవ్య" కావ్య సుమరాజి
నాంధ్రభూమి కందించిన యట్టి విదిత
సాహితీలత పుష్పింపజాలకునికి
కారణం బది యేమొ నే గాంచనైతి.

కరము పూచిన యొకనాటి "కావ్యవల్లి"
మెండుగా పూయదొండును, రెండు దక్క
వాసిమై నేడుసురభిళశ్రీసుమములు;
ఇట్టిగతి గొడ్డువోవగానేమి కతమొ ?

లోటు వాటిలెనేమొ నేటి దోహదమున
            నేకరీతినె వాని సాకుచుంటి,
సమసిపోయినదేమొ సారగ్రహణశక్తి !
            వివరింపగా నది ఎవరి కెఱుక ?
సహృదయాదరణమ్ము సన్నగిల్లినదంచు
            నలుకబూనినదొ ? కావ్యలతికయును,
మాత్సర్యవంతుడౌ మనుజుని తామస
            దృష్టిదోషమ్ము ప్రాప్తించెనేమొ !
క్రొత్త వింతలు, ప్రాతలు రోతలు గద !
నవ్యు లెఱుగరొ ! యీకావ్య దివ్యశక్తి
పడయునో లేదొ యిది పురాప్రాభవమ్ము
నాకు సాంత్వన మ్మొక "వసంత ప్రతీక్ష"
డా .యస్వీ  రాఘవేంద్ర రావు 

No comments:

Post a Comment