తే. అయిదు తలల నాగేంద్రున కడలిపోయి,
దాని బుసలకు వసివాడు ధరణిగావ
"గబ్బిలము రచియించితి వబ్బురముగ
ప్రజల నాల్కల తిరముగ బ్రతుకు సుకవి!
క. కిట్టనివారి నెదుర్కొని
పట్టము గట్టితివి నీవు వాణీసతికిన్
దిట్టకవివై, భళీ భళి!
"పుట్టుకవివి నీవు, నిన్ను పొగడగ తరమే?
తే. "వాణి నా రాణి" యనె కవివరు డొకండు,
"నను వరించెను శారద" యంటి వీవు,
"దమ్ము" గల "కవిపుంగవుల్ " సుమ్ము మీరు,
అందుకొనుడయ్య ! మాదు జోహారు లివిగొ !
క. శ్రీనాథునివలె "సీసము"
మానుగ రచియించు నేర్పు, మధురం బబ్బెన్,
మానిక మైతివి "మధుర
శ్రీనాథా !" కొనుము నతులు చిరతరకీర్తీ !
తే. "చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి" చేతిమీద
"గండపెండార" మందిన కాలమందు
ఘనత "కవిదిగ్గజ", "నవయుగ కవిచక్ర
వర్తి" బిరుదమండిత హర్ష కీర్తులంది
దిగ్గజారోహణాధిక దీప్తి తోడ
విజయవాటి నూరేగిన విదిత సుకవి !
గుండెలను పిండు నవమాన ఖండనముల
నాదమఱచి, మైమఱచితి వాంధ్రులెల్ల
బ్రహ్మరథము పట్టిన యా శుభతరుణాన,
"పలుకులమ్మ"యు పులకించి పరవశించె:
"పచ్చిబాలెంతరా" లని భరతమాత
బొగడి "గడనకెక్కిన యాంధ్రపుత్ర" వర్య !
"పద్మభూషణా !" జాషువా ! ప్రథితకీర్తి !
అందుకోవయ్య ! జన్మదినాంజలులను.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .( 28/09/2011 జాషువా జయంతి సందర్భముగా జేగురుపాడు లో శ్రీ దివాన్ చెరువు శర్మ గారిచే నిర్వహింపబడిన సదస్సు లో గానం చెయ్యబడినవి)
జాషువా జయంతిని పురస్కరించుకొని మీరు వ్రాసిన పద్యాలు మధురంగా ఉన్నాయి.
ReplyDeleteమీరు ‘శంకరాభరణం’ బ్లాగును వీక్షించి, సమస్యలు, దత్తపదులు పంపినందుకు ధన్యవాదాలు.
ఈ రోజు మీ దత్తపదినే ప్రకటించాను.
సమస్యలు ముఖ్యంగా ఆటవెలది, తేటగీతి, కందం ఈ ఛందాలలో మీవద్ద సిద్ధంగా ఉన్నవి కాని, మీరు సిద్ధం చేసి కాని పంపవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.