audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday, 19 October 2011

"రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు


 అక్టోబర్ 20 ప్రముఖ చలనచిత్ర హాస్యనటులు
 శ్రీ రాజబాబు జన్మదినోత్సవం సందర్భంగా


            
స్వాగతంబిదే నీకు సుస్వాగతంబు
హాస్యనట సార్వభౌమ! చే నందుకొనుమ!
పటువితరణాది గుణగణ్య! నటవరేణ్య!
"రమ్యకీర్తి గులాబు!"శ్రీరాజబాబు!

తేనెసోనల నొలికించు మానసమున,
నమృతపు ఝరులు చిలికించు మమతతోడ,
నాణిముత్యాల తులకించు వాణితోడ,
మందహాసము పలికించు మధురమూర్తి!

సునిశితంపు హాస్యమ్ము నీ సొమ్ము సుమ్ము!
ఇట్లు కడుపుబ్బ నవ్వించు టెట్టులబ్బె?
పూర్వజన్మసంచిత మహాపుణ్య మేమొ?
కాదు, కా దది ప్రేక్షక ఘనసుకృతము 

జననికి జన్మభూమికి ఘనత గూర్చు
సదయ! చదివితి వీవు మా సంస్థలోన
"పూర్వవిద్యార్థి!" యిది మా కపూర్వ గర్వ
మందుకొనుమోయి! మా హృదయాంజలులను.
నీవు సృష్టించిన నీతిచిత్రంబులే
        చటుల నిర్మాత వనుటకు సాక్షి,
నీతిదాయకములౌ నీ చిత్రగాథలే
         చటుల రచయితవనుటకు సాక్షి,
"కోరుకొండ" కిడిన భూరివిరాళమే
          అతివితరణ సుశీలతకు సాక్షి,
నవకళాకారుల నాదరించెడి తీరు
          లతిదృఢ స్నేహశీలతకు సాక్షి,
రాజబాబు! ఆంధ్రాళి  నీరాజనంబు
లందు నిన్ను సమ్మానించు నధిక భాగ్య
మబ్బె; రాజశబ్దంబు చంద్రార్థ మగుట
నూలుపోగుగ మా"పద్యమాల" గొనుము.
 డా .యస్వీ రాఘవేంద్ర రావు .
(వి.టి కళాశాల విద్యార్థి సంఘము ప్రముఖ చలనచిత్ర హాస్యనటులు
శ్రీ రాజబాబును ది>13/3/1976 తేదీని సన్మానించిన సందర్భమును
పురస్కరించుకుని సమర్పించిన "పద్యమాల")


                         
  రాజమండ్రి లో ఆవిష్కరింపబడిన శ్రీ రాజబాబు శిలా విగ్రహం 

1 comment: