audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday 27 May 2012

"దేశభక్త్యంతరంగ వీరేశలింగ !"


శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భముగా 

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్యకర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు, పూజ్యకవి, నా యుగపూరుషు నాత్మ గొల్చెదన్.

పెంపగు నంధ పద్ధతుల పేర్చిన మూఢుల కుక్కు కత్తియై,
ఇంపుగ సాని కొంపల చరించు విటాళికి ప్రక్కబల్లెమై,
పెంపగు లంచగొండ్ల తగ పీచ మడంపగ గుండెగాలమై,
సొంపగు నీదు సంస్కరణ స్తుత్యము కాదె ? వివేకవర్ధనా !

"రాజశేఖరచరిత్ర" రచించినాడవు
      మూఢవిశ్వాస నిర్మూలమునకు,
ఆంధ్రీకరించితి వత్యంతమును రస
       వంతమ్ముగాగ "శాకుంతలము"ను.
సంతరించితి వతిశ్రమకోర్చి "యాంధ్ర క
       వుల చరిత్రమ్ము" నపూర్వ సరణి,
చిరకీర్తియుతము నీ "స్వీయ చరిత్రమ్ము"
       తత్కాల సాంఘిక దర్పణమ్ము
బహుళ కావ్యమ్ము లాదిగా  పాఠ్య పుస్త
కముల వఱకు శతాధిక గ్రంథవితతి
లలిత సాహితీ ప్రక్రియల వెలయించి
తభినుతంబుగ "గద్య తిక్కన" సమాఖ్య !

భర్త గతాసుడై బ్రతుకు భారముగాగ సమస్త సౌఖ్యసం
హర్త ప్రపంచకర్త " యని యాత్మను క్రుంగి కృశించి నిత్యస
ద్వర్తన ప్రొద్దుపుచ్చెడు వితంతుల వంత దొలంచు సంఘసం
స్కర్తృగణాగ్రగణ్యుడవు గాదె ! "సతీజన లోకబాంధవా !"

అలనా డీ ఘనరాణ్మహేంద్రపురి విద్యాజ్యోతి నీ చేతితో
వెలిగింపంబడి, నే డఖండమగు దీప్తిన్ తేజరిల్లంగ మా
న్యులు, దక్షుల్, కరుణాసముద్రులు, సుధీయుక్తుల్ సమీక్షింపగా
నిల నిష్కంప నివాతమై సతము వర్ధిల్లున్ జగన్మాన్యమై.

"స్త్రీబుద్ధిః ప్రళయాంతకీ" యనుచు, నా స్త్రీబుద్ధికిన్ తోడు వి
ద్యాబంధంబు చెలంగుచో స్థితు లనూహ్యంబంచు వాదించు చిం
తాబద్ధాత్ముల నోర్చి చేసితి విద్యాగంధ విఖ్యాతలన్
పూబోడుల్ నిను విస్మరింపరు సుమీ ! పూజ్యాంధ్రవైతాళికా !

హరిజనులనంగ నా శ్రీ
హరిజనులని గాంధికన్న నతిపూర్వం బీ
ధర చాటి, వారి స్థితి ను
ద్ధరింప సమకట్టి తీవు దళితోద్ధరణా !

మంత్ర తంత్రాచార మహిమ లొప్పకునికి
       "శరభసాళ్వ" ఘటన సాక్షి కాదె ?
పూర్వ సువాసినుల్ పుణ్య సువాసిను
       లగుట నీ ఘనతకు సాక్షి కాదె ?
పాపితి వతివృద్ధ బాల్యవివాహ దు
       రాచారము లలర నాత్మబలము,
ఆంధ్రభూమినె గాక యార్యభూమికి గూడ
       వ్యాపించె నీదు కార్యక్రమంబు,
నీవు నిల్పిన "హితకారిణీ సమాజ
ము" "పుర మందిర మ్మెపుడు నీ పురిని నిలిచి
యుండు మణిదీపిక లగుచు నొప్పిదముగ
"దేశభక్త్యంతరంగ వీరేశలింగ !"

"మహిని మానవ సేవయే మాధవునకు
సేవ " యని సర్వమును లక్ష్యసిద్ధి కొఱకు
త్యాగ మొనరించినాడవు ధన్యజీవి !
తావకీనాత్మశాంతి నిత్యంబు గాదె !

మూగవోయిన వీణ తీగలు సవరించి
       యనురాగ గీతిక లాలపించె,
పరిమళింపక మున్నె వసివాడు కుసుమంబు
       మరల గుబాళించె నరుసమంది,
మోడువారు బ్రతుకు తోడు కల్గుటచేత
       చిగురించి పండెను చిరతరంబు,
శూన్యాభ్రఫాలాన సోమాభతిలకంబు
       పున్నమి వెన్నెలన్ చెన్ను గొలిపె,
ఎవని కృషి నవని ననద యువిద లెల్ల
ముత్తయిదువ లైరి మిగుల మోద మలర
నట్టి వీరేశలింగాఖ్యు నతివ లెల్ల
నిచ్చలు స్మరించి ఋణ మీగి నెగడ దగును.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .                           

No comments:

Post a Comment