సంక్రాంతి శుభాకాంక్షలతో
"సాతానిజియ్యరు" సరస సంగీతంబు
వీనుల విందుగా వినదలంచి,
ముద్దుగుమ్మల దిద్దు ముంగిళ్ళ మ్రుగ్గులు
ముచ్చటారగ గాంచి మురియదలచి,
కోడిపందెములలో కోపించు పల్లెవా
సుల లేతకయ్యముల్ చూడదలచి,
"అంబపల్కుల" తోడ డంబుమీరగ వచ్చు
"బుడుబుడుక్కని" గని మురియదలచి,
వత్సరముప్రవాసము చేసి వచ్చితీవు
సంక్రమణలక్ష్మి ! ఖిన్నాంధ్రజగతి నేడు
ఉల్లి, వెల్లుల్లి ఘాటుకు తల్లడిల్లి
కూరగాయల నంగళ్ళ కొనగలేక
అధికధర లాకస మంటుచుండ
తెలుగు తమ్ముళ్ళ యుద్యమాల్ తెమలకున్న
ప్రకృతివిలయవ్యధావేళ బరువుగుండె
గౌరవము నిండు పేద స్వాగతము పలుకు.
పంట నింటికిచేర్చి ఫలియించె శ్రమ యంచు
హాయిగ నిట్టూర్చు హాలికుండు,
క్రొత్తయల్లుని కోర్కె కూరిమి చెల్లించి
కూతు ముచ్చట దీర్చు రైతురాజు,
మనసులో మర్మాలు మచ్చుకైనను లేక
చిఱునవ్వు చిలుకు కృషీవలుండు
సంక్రాంతి వేడుకల్ సంబరంబునజేసి
హర్షసంపద నిచ్చు కర్షకుండు,
నేడు నిడుమల బడుచుండె తోడులేక
ఆలితాళి తాకట్టుగా నట్టెపెట్టి
తెచ్చి పైకంబు, నెరువుల తెచ్చి వేయ
పంట కోతకురాగ తుపాను ముంచె
మూలుగుచునున్న నక్కపై మ్రగ్గినట్టి
తాటిపండు పడినయట్లు తల్లడిలుచు
మ్రోడువారిన బ్రతుకును మోయలేక
వ్యథిత చిత్తమ్ముతో పల్కు స్వాగతమ్ము.
క్రొత్తబట్టలు నేసి క్రొంగ్రొత్త వెలుగు
నీకు సమకూర్చుచుండు నా నేతగాడు
నేతసామగ్రి కొనలేక నిస్పృహపడి
స్వాగతము నీకుజెప్ప నంబరముజూచు.
ముద్దబంతి పువ్వులబోలు ముద్దరాండ్ర
సహజసౌందర్యమునకు భూషలనుగూర్చు
స్వర్ణకారుడు, వైవర్ణ్యవదనసీమ
నింగి కెగసెడు బంగరు పొంగుదలచి
స్వాగతముచెప్పు వచన సువర్ణమాల.
వచ్చినవారిపొమ్మనక వైరులనేనియు పిల్చి స్వాగతం
బిచ్చెడి జాతి మాది, వినిపించుము దారుణదీనగాథలన్
మచ్చరమూను తత్ప్రకృతిమారికి; దోషములెంచి యెన్నడున్
చిచ్చఱకంటజూచి మము చింతిలజేయకు మంచు చెప్పుమా !
డా.యస్వి.రాఘవేంద్రరావు.
No comments:
Post a Comment