మకరసంక్రాంతి శుభాకాంక్షలతో
చేతలన్ చేయించు రైతురాజు,
మీసము మెలివేసి వాసి వక్కాణించు
ప్రథితకీర్తి యయిన రైతురాజు,
సంక్రాంతి, దసరాల సంబరాల్ జరిపించు
మోతుబరి యయిన రైతురాజు
దైవకార్యాల నుదార వదాన్యతన్
ప్రకటించు భక్తుడౌ రైతురాజు
నేడు లేడు; ఆ ఠీవియు నేడు లేదు;
మీసమున్నను మెలివేయ రోసమేది?
భక్తి యున్నను దాతృత్వశక్తి యేది?
గాదెలే నిండుకున్నవి కాలమహిమ.
ఎండనక వాన యనకను
కండలు కరిగించి నీవు కర్షకవర్యా !
పండింతువు పలు పంటలు
మెండుగ, నినుబోలు దాత మేదిని గలడే ?
పక్షితతు లెన్న నీ కిలప్రాణహితులు,
పశుగణమ్ములు భవదీయ పంచప్రాణ
ములు, హలమె నీ యనుంగు తోబుట్టు, వరయ
ప్రకృతి నీ మాతయే జగత్ప్రాణదాత !
పశువులే నీదు బాధలు పంచుకొనును,
చెట్లు చల్లని నీడల సేదదేర్చు
మంచె నీ కొసగు ప్రశాంతి, మనుజు డకట !
నీ శ్రమ నెఱుంగ, డిల నిదే నేటి తీరు.
ఆకుపచ్చని చీర నందగించు పడంతి
యందాలు గాంచి యానందమొంది
పసుపుపచ్చని చీర మిసమిసల్ దిలకించి
మురిపెంబు నరయుచు మురియుచుండి
పసిడివన్నెల చీర మిసిమి వీక్షించుచు
ననుదినంబును మది హర్షమొంది,
వెలిపట్టుచీరను వెన్నెలలో జూచి
కనులపండువుగాగ తనియుచుండు,
కర్షకసహోదరా ! నీదు హర్షభరము
పంటవలతి సోయగముల పరవశతయు
పైటగాలుల రెపరెపల్ పలుకరింత
లెంతకాలము నిల్చునో యెఱుక లేదు.
మోద మది విధి వక్రింప ఖేద మగును,
ఎండ మెండుగా కాసిన యెండిపోవు,
వాన జడివట్టి కురిసిన వాడిపోవు,
గాలివానలు తాకిన కమలిపోవు,
ప్రకృతి వైపరీత్యంబుల వికృతినందు.
పోల నడకత్తెర నడుమ పోకచెక్క
యయ్యె నీ బ్రతు, కిట నధికారుల నడు
మను దళారుల నడుమను మ్రగ్గినావు,
పూర్వవైభవప్రాభవముల్ గలుగును
నీకు; రైతురాజా! నమ్ము నిక్కువమ్ము !
వేకువ కోడి కూయగనె వేగమె నాగలి దాల్చి మూపునన్
ఆకలిదీర్చు చల్దిముడి హస్తము నందు ధరించి, యెద్దులన్
తోకొని పంటచేల బడి దున్నుట మున్నుగ బెక్కు కార్యముల్
చేకొని బండచాకిరికి బాల్పడు కాలము పోయె కర్షకా !
వ్యవసాయమందు సహకా
రవిధి ప్రబలె, సన్నకారు రైతులు కూడన్
వివిధాధునిక పరికరా
ల విరివిగా వాడి నేడు లబ్ధి బడయరే ?
ఎండు డొక్కల తోడను, మండు కడుపు
తోడ, చింపి గుడ్డలను నీదు సుతులుండ,
లోకమున కిడుదువు కూడు లోటు లేక,
దేశసేవయే నీకిల ధ్యేయ మయ్య !
నిష్కపట, నిరాడంబర, నిరుపమాన
జీవితము నీది, యైహిక జీవితమున
సుఖ మొదవకున్న పరమున సుఖము గలుగు
పరహితమ్ము నిశ్చయముగ వమ్ము కాదు.
కంటికి ఱెప్పయై సతము కావలి కాసెడు "తత్త్వయోగి"వే !
ఇంటికి పంట వచ్చు వఱ కెంతయు నోర్మి నొందు "మౌని"వే !
మంటిని కాంచనంబు గతి మార్పగనేర్చు "సువర్ణ యోగి" వే !
అంటియు నంటకున్నసిరి కాశ వహింపని "ఆత్మయోగి"వే !
స్వేద బిందువే యిల సుధాసింధువు గతి
పేదసాదల కరుణించి సేదదేర్చు,
నడుమువంచువా డధిపతి నవనిధులకు
నమ్ము కర్షకా ! జయము తథ్యమ్ము సుమ్ము !
డా.యస్వీ.రాఘవేంద్ర రావు
(అన్నదాత పడుచున్న కడగండ్లకు స్పందించి రచించినవి)
No comments:
Post a Comment